జనసేన ప్రస్తావన తేని ప్రధాని, తడబడిన వీర్రాజు

రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయని మోడీ అడగ్గా.. 21 అని సోము వీర్రాజు చెప్పగా పక్కనే ఉన్న నేతలు 26 జిల్లాలు అంటూ సరిచేశారు. రాష్ట్రంలో మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయని పీఎం అడగ్గా.. సోము సమాధానం చెప్పలేకపోయారు

Advertisement
Update:2022-11-12 08:59 IST

ప్రధాని నరేంద్రమోడీతో ఏపీ బీజేపీ కోర్‌ కమిటీ శుక్రవారం రాత్రి సమావేశం అయింది. గంటన్నరపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతల అభిప్రాయాలను వినేందుకే ఎక్కువగా పీఎం ప్రాధాన్యత ఇచ్చారు. టీడీపీకి అనుకూలమని పేరున్న నేతలు వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేశారు. అందరి అభిప్రాయాలను విన్న ప్రధాని నరేంద్రమోడీ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి పలు క్రీడలు నిర్వహించి యువతకు పార్టీని దగ్గర చేయాలన్నారు.

ఒకప్పుడు గుజరాత్, ఏపీ, కర్నాటకలో బీజేపీ పరిస్థితి ఒకేలా ఉండేదని.. ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని.. ఏపీలో మాత్రం పరిస్థితి మారలేదన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేయడం ఒక్కటే పార్టీ బలోపేతానికి మార్గమని సూచించారు. రాష్ట్ర రాజకీయాలపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, దీన్ని అవకాశంగా తీసుకుని బీజేపీ బలపడాలని హితబోధ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు వివరించాలన్నారు. రాజకీయాల్లో నెమ్మదితనం అస్సలు పనికి రాదని.. అలా ఉంటే మరొకరు అవకాశాన్ని చేజెక్కించుకుంటారని మోడీ వ్యాఖ్యానించారు. ఆ అవకాశం మరొకరికి ఇవ్వకూడదన్నారు. సమావేశంలో జనసేన పేరును ప్రధాని ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది.

రాష్ట్రానికి సంబంధించి వివరాలను అడిగినప్పుడు అధ్యక్షుడు సోము వీర్రాజు తడబడినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయని మోడీ అడగ్గా.. 21 అని సోము వీర్రాజు చెప్పగా పక్కనే ఉన్న నేతలు 26 జిల్లాలు అంటూ సరిచేశారు. రాష్ట్రంలో మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయని పీఎం అడగ్గా... సోము సమాధానం చెప్పలేకపోయారు. దాంతో పక్కనున్న నాయకులు గణాంకాలను వివరించారు. అధ్యక్షుడై ఉండి జిల్లాలు, మండలాల సంఖ్య చెప్పలేకపోవడంతో సోము వీర్రాజు ఇబ్బందిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News