నేను పెయిడ్ ఆర్టిస్ట్ ని కాదు.. మెగా ఫ్యామిలీపై పోసాని ఘాటు వ్యాఖ్యలు

మెగా ఫ్యామిలీ ప్రభావం అంతగా ఉంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో వారు నిలబెట్టినవారే గెలిచేవారు కదా అని అన్నారు పోసాని.

Advertisement
Update:2024-04-27 23:01 IST

నటుడు, రచయిత, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను పవన్ కల్యాణ్ తో విభేదించినంత మాత్రాన తనకు సినిమా అవకాశాలు తగ్గలేదని చెప్పారు. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మెగా ఫ్యామిలీ చేతుల్లో ఉందా అని ప్రశ్నించారు. మెగా ఫ్యామిలీ ప్రభావం అంతగా ఉంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో వారు నిలబెట్టినవారే గెలిచేవారు కదా అని అన్నారు. మోహన్ బాబు కొడుకు విష్ణు గెలిచేవారు కాదు కదా అన్నారు. మెగా ఫ్యామిలీకి ప్రజల మద్దతు ఉంటే వారే గెలవాలి కదా అని లాజిక్ తీశారు పోసాని. తెలుగు సినిమా పరిశ్రమను, కష్టాన్ని నమ్ముకున్నాను కాబట్టే.. తనకు ఇండస్ట్రీలో పేరొచ్చిందని చెప్పారు.

పెయిడ్ ఆర్టిస్ట్ ని కాదు..

డబ్బులు తీసుకుని ప్రెస్ మీట్ లు పెట్టే పెయిడ్ ఆర్టిస్ట్ ని తాను కాదని అన్నారు పోసాని కృష్ణ మురళి. కావాలంటే తనకు నార్కో టెస్ట్ చేసుకోవచ్చని చెప్పారు. ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ అవ్వకముందు నుంచే తాను ప్రెస్‌మీట్‌లు పెట్టానని వివరించారు. గత 15 ఏళ్లుగా ప్రెస్‌మీట్‌ లు పెడుతున్నానని, డబ్బులు తీసుకుని తాను ఒక్క ప్రెస్‌మీట్‌ పెట్టినట్టు నిరూపించినా తాను దేశం వదిలి వెళ్లిపోతానని సవాల్ విసిరారు పోసాని. జగన్‌ రాజకీయాల్లోకి రాక ముందు నుంచి తాను మీడియా సమావేశాలు పెడుతున్నానని చెప్పారు.

ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు మా వాడు గెలువాలి.. మా కులపోడు గెలవాలి అనడం కరెక్ట్ కాదని, అందుకే తాను కులాలను పట్టించుకోలేదని, జగన్ కోసం పని చేస్తున్నానని చెప్పారు పోసాని. చంద్రబాబు లాంటి వ్యక్తి వల్ల సమాజం పాడైపోతుందని అన్నారు. ఏపీలో తాను ప్రచారం చేసేందుకు ఎక్కడికైనా వెళ్తానన్నారు. పిఠాపురానికి వెళ్లేందుకు సైతం సిద్ధం అన్నారు. ఓడిపోయినప్పుడు కూడా తాను జగన్‌ వైపే ఉన్నాని, జగన్‌ జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ మారలేదని చెప్పారు పోసాని. 

Tags:    
Advertisement

Similar News