బెజవాడ నడిబొడ్డున రగులుతున్న రాజకీయం
అధికార వైసీపీ, విపక్ష టీడీపీలోనూ అసమ్మతులు, అసంతృప్తులు రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. వైసీపీలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు మధ్య, టీడీపీలో వంగవీటి రాధా, బొండా ఉమాల మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయం కాక మీద ఉంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీలోనూ అసమ్మతులు, అసంతృప్తులు రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. వైసీపీలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు మధ్య, టీడీపీలో వంగవీటి రాధా, బొండా ఉమాల మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది.
సీటు మార్పుతో కాక మొదలు
వైసీపీలో సిటింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్థానంలో పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించడం వైసీపీలో రచ్చకు దారి తీసింది. తన స్థానాన్ని వెల్లంపల్లికి ఎలా ఇస్తారని మల్లాది విష్ణు మండిపడుతున్నారు. అధిష్ఠానం చెప్పింది కాబట్టి పోటీ చేస్తానని వెల్లంపల్లి అంటున్నారు. అసంతృప్తిలో ఉన్న మల్లాదిని బుజ్జగించేందుకు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి లాంటి సీనియర్ నేతలను వైసీపీ హైకమాండ్ ప్రయోగిస్తోంది. అయినా విష్ణు మెత్తపడేలా కనపడటం లేదు. అవసరమైతే కాంగ్రెలో చేరి అయినా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఆయన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లు సమాచారం.
టీడీపీలో సోషల్ వార్
మరోవైపు టీడీపీలోనూ వంగవీటి రాధాకృష్ణ, బొండా ఉమామహేశ్వరరావుల మధ్య సెంట్రల్ సీటు కోసం గట్టి పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాధాను టీడీపీ నమ్మడం లేదు.. అందుకే ఇవే కారణాలంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇది బొండా ఉమా వర్గం పనేనని రాధా వర్గీయులు మండిపడుతున్నారు. నమ్మాలంటే ఏ లక్షణాలు ఉండాలి.. సొంత కులాన్ని మోసగించాలా, అభివృద్ధి పనుల పేరుతో నిధులు మేసేయాలా అంటూ బొండా ఉమాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రివర్స్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ పోరు పార్టీని ముంచేస్తుందేమోనని టీడీపీ క్యాడర్ మథనపడుతోంది.