విశాఖ రాజధానికి మరో ముందడుగు.. రైల్వే జోన్ కల సాకారం!

ఏపీ పునర్విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే హామీని చేర్చారు. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు పూర్తయినా ఇంత వరకు జోన్ ఏర్పాటు పూర్తి కాలేదు.

Advertisement
Update:2022-10-28 09:03 IST

విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయడంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక అయిన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ముహూర్తం నిర్ణయించింది. అంతే కాకుండా పలు ప్రతిష్టాత్మక సంస్థల శంకుస్థాపనలు కూడా జరుగబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 11న విశాఖ రానున్నట్లు తెలుస్తున్నది. ఆ రోజు విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఏపీ పునర్విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే హామీని చేర్చారు. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు పూర్తయినా ఇంత వరకు జోన్ ఏర్పాటు పూర్తి కాలేదు. మరోవైపు ఇటీవల విభజన సమస్యలపై ఢిల్లీలో జరిగిన సమావేవంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే అది ఆర్థికంగా నష్టదాయకమని రైల్వే బోర్డు ప్రకటించింది. దీంతో ఏపీ ప్రజలు ఒక్కసారిగా నిరాశలో కూరుకొని పోయారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ వెంటనే అప్రమత్తం అయ్యారు. అధికారులను ఢిల్లీకి పంపి రైల్వే జోన్ ఏర్పాటులో నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. చివరకి రైల్వే బోర్డు నో చెప్పినా కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని మన్నించింది. దక్షిణ కోస్త రైల్వే జోన్ ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది.

ప్రధాని మోడీ పర్యటనలో రూ. 120 కోట్లతో నిర్మించనున్న జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. డీఆర్ఎం కార్యాలయం సమీపంలోనీ వైర్‌లెస్ కాలనీలో ఈ కార్యాలయం నిర్మించనున్నారు. అలాగే రైల్వే అనుబంధ ఆర్‌వీఎన్ఎల్ వర్క్ షాప్‌ను ఇప్పటికే రూ. 260 కోట్లతో నిర్మించారు. దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. నెలకు 200 వ్యాగన్ల ఓవర్ హాలింగ్ ఇక్కడ జరుగనున్నది. రూ. 446 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు ప్రధాని, సీఎం శంకుస్థాపన చేస్తారు.

రైల్వే జోన్‌తో పాటు ముఖ్యమైన కార్యాలయాలు కూడా ఏర్పాటు కానుండటంతో పరిపాలన రాజధాని దిశగా మరో అడుగు పడినట్లే అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. దక్షిణ మధ్య రైల్వేకు హైదరాబాద్ (సికింద్రాబాద్) ఎలా హెడ్ క్వార్టర్‌గా ఉందో.. ఇప్పుడు దక్షిణ కోస్తాకు విశాఖ హెడ్ క్వార్టర్‌గా మారనుంది. రాజధానికి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖలో భారీ ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా నిర్మించనున్నదని.. ఇది ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కీలకమైన రాష్ట్ర శాఖల కార్యాలయాలు కూడా విశాఖకు వస్తాయని చెబుతున్నారు. ఇందుకు విశాఖ రైల్వే జోన్ కీలకంగా మారిందని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News