కడప సిట్టింగుల్లో సర్వే టెన్షన్

సర్వే బృందం జనాల్లోనే కాకుండా పార్టీ క్యాడర్ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. అన్నీ నియోజకవర్గాల్లో సర్వే పూర్తయిన తర్వాత రిపోర్టును జగన్మోహన్ రెడ్డికి అందచేయబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

Advertisement
Update:2023-04-25 11:27 IST

రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల‌ ఎంపిక విషయమై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) బృందం కడప జిల్లాలో విస్తృతంగా సర్వే చేస్తోంది. జిల్లాలోని పది నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్న విషయం తెలిసిందే. వీరిపై జనాల్లో ఉన్న అభిప్రాయాలేమిటి? వీళ్ళ పనితీరు ఎలాగుంది? కొత్తవాళ్ళని ఎమ్మెల్యేలుగా చూడాలని అనుకుంటున్నారా? సిట్టింగుల్లోని ప్ల‌స్‌లు..? మైనస్‌లు ఏమిటి ? అనే అంశాల ప్రాతిపదికగా సర్వే జరుగుతోందట.

అందుబాటులో ఉన్న‌ సమాచారం ప్రకారం రాజంపేట, కమలాపురం, బద్వేలు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోని జనాల్లో ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేకత ఉందని బయటపడిందట. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. వివిధ కారణాలతో మేడా జనాలకే కాదు చివరకు పార్టీ క్యాడర్‌కు కూడా అందుబాటులో ఉండటంలేదట. ఇక కమలాపురంలో అయితే ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి వ్యవహారశైలిపై జనాల్లో బాగా వ్యతిరేకత ఉందని తేలిందట. అందుకనే ఈయన కూడా రాబోయే ఎన్నికల్లో తన కొడుకు నరేన్ రామాంజులరెడ్డిని పోటీ చేయించాలని చూస్తున్నారట.

బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ జనాలకు పెద్దగా అందుబాటులో ఉండరట. వృత్తిరీత్యా డాక్టర్ అయిన సుధ తన భర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతి కారణంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల మీద కన్నా వృత్తిలోనే ఈమె ఎక్కువ బిజీగా ఉంటారట. ఇక ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మధ్య గొడవలతో పార్టీ పరువు రోడ్డున పడిందట.

వీళ్ళిద్దరి ఆధిపత్య పోరుతో పార్టీ రెండుగా చీలిపోయింది. రెండు వర్గాల మధ్య గొడవలు కూడా అవుతున్నాయి. అభివృద్ధి మీద కాకుండా ప్రత్యర్థివర్గంపై ఆధిపత్యం కోసమే ఆలోచిస్తున్నారని జనాల్లో రాచమల్లు మీద అసంతృప్తి ఉన్నట్లు తేలిందట. సర్వే బృందం జనాల్లోనే కాకుండా పార్టీ క్యాడర్ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. అన్నీ నియోజకవర్గాల్లో సర్వే పూర్తయిన తర్వాత రిపోర్టును జగన్మోహన్ రెడ్డికి అందచేయబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మరి ఎంత మంది సిట్టింగులకు జగన్ టికెట్ ఇస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News