ఎమ్మెల్యేగారి తాలూకా అంటే కుదరదు.. స్టిక్కర్ పీకేశారు
పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా అనే స్టిక్కర్ తో వెళ్తున్న స్కూటీని ట్రాఫిక్ పోలీసులు ఆపారు..? ఎవరయ్యా మీలో ఎమ్మెల్యేగారి తాలూకా అని అడిగే సరికి ఆ యువకులు నీళ్లు నమిలారు.
మేం పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా అంటూ ఇటీవల కాలంలో చాలామంది యువకులు బైక్ లపై స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారు. ఈ వ్యవహారం కేవలం పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాలేదు, ఏపీలో చాలా చోట్ల ఈ స్టిక్కర్లు కనపడుతున్నాయి. పవన్ కల్యాణ్ పై అభిమానాన్ని ఎవరూ కాదనరు, అది శృతి మించి నిబంధనలకు అడ్డుపడితేనే అసలు సమస్య. ఆ సమస్యను చాలా పద్ధతిగా పరిష్కరించారు ట్రాఫిక్ పోలీసులు. పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా అంటూ స్కూటీపై అంటించిన స్టిక్కర్ ని సదరు యువకులతోనే తీసివేయించారు.
అసలేం జరిగింది..?
పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా అనే స్టిక్కర్ తో వెళ్తున్న స్కూటీని ట్రాఫిక్ పోలీసులు ఆపారు..? ఎవరయ్యా మీలో ఎమ్మెల్యేగారి తాలూకా అని అడిగే సరికి ఆ యువకులు నీళ్లు నమిలారు. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే..? సదరు స్టిక్కర్ ని నెంబర్ ప్లేట్ స్థానంలో అంటించడం. నెంబర్ ప్లేట్ కనపడకుండా స్టిక్కర్ అంటించే సరికి ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపారు. అలా స్టిక్కర్ అంటించుకోవడం నిబంధనలకు విరుద్ధం అని చెప్పారు. మీ అభిమానాన్ని ఎవరూ కాదనరని వారికి నచ్చజెప్పారు. అభిమానం ఉంటే బండిపై ఇంకెక్కడైనా స్టిక్కర్ వేయించుకోవాలని, నెంబర్ ప్లేట్ ని మాత్రం వదిలేయాలని చెప్పారు. నెంబర్ ప్లేట్ స్పష్టంగా కనపడుతుంటేనే.. బండి దొంగతనం జరిగినప్పుడు కానీ, ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు కానీ సులభంగా పరిష్కరించగలం అని వివరించారు. ఆ స్టిక్కర్ ని ఆ యువకులతోనే తీసివేయించారు ట్రాఫిక్ పోలీసులు.
స్టిక్కర్ తొలగింపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది యువకులు పోలీసుల చర్యను వ్యతిరేకించగా, చాలామంది పోలీసులు చేసింది కరెక్టేనని సమర్థించారు. నెంబర్ ప్లేట్ పై స్టిక్కర్ అతికించడం సరికాదన్నారు. పోలీసులు స్టిక్కర్ ని వ్యతిరేకించలేదని, దాన్ని నెంబర్ ప్లేట్ పై అతికించడాన్ని మాత్రమే తప్పుబట్టారని అంటున్నారు. మొత్తమ్మీద అభిమానంతో మొదలైన ఈ ట్రెండ్ చివరికి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన వరకు చేరుకోవడం విశేషం.