అప్పటినుంచి పేర్ని నాని సైలెన్స్.. అసలేమైంది..?

వారాహి యాత్ర మొదలైన టైమ్ లో చెప్పులు చూపించిన పేర్ని నాని, యాత్ర ముగిసే సమయానికి కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేకపోవడం విశేషం.

Advertisement
Update:2023-07-02 11:31 IST

పవన్ కల్యాణ్ ని విమర్శించే విషయంలో వైసీపీ నుంచి ఉత్సాహంగా మీడియా ముందుకొచ్చేవారిలో మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు. వారాహి యాత్ర మొదలైన వెంటనే పేర్ని నాని, కౌంటర్ ప్రెస్ మీట్లకు రెడీ అయ్యారు. కత్తిపూడిలో పవన్ సభ తర్వాత రెండు చెప్పులు చూపిస్తూ ప్రెస్ మీట్ లో అటాక్ చేశారు. మాకూ చెప్పులున్నాయి జాగ్రత్త అంటూ హెచ్చరించారు. దాని తర్వాత పవన్ తన రెండు చెప్పులూ పోయాయి అనడం, చెప్పులు కాదు ముందు నీ పార్టీ గుర్తు పోయింది అది చూసుకో అంటూ పేర్ని కౌంటర్లివ్వడం తెలిసిందే. ఈ వ్యవహారం జరిగి రెండు వారాలవుతోంది, అప్పటినుంచి ఇప్పటి వరకు ఆయన సైలెంట్ అయ్యారు. కారణం ఏంటి..?

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడిన మాజీ మంత్రి పేర్ని నాని, యాత్ర ముగిసే సమయంలో మాత్రం తెరపైకి రాలేదు. పవన్ ని విమర్శించే భారమంతా.. స్థానిక నాయకులకే అప్పగించినట్టున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే, భీమవరం ఎమ్మెల్యే.. పవన్ పై తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. మంత్రి అంబటి అప్పుడప్పుడు ట్విట్టర్లో చెణుకులు విసిరారు. సీఎం జగన్ అమ్మఒడి సభలో పవన్ పై పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు. కౌంటర్ గా భీమవరం సభలో పవన్ ఆ ఎపిసోడ్ ని ముగించారు.

యాక్టివ్ గా లేరెందుకు..?

గతంలో పవన్ ని విమర్శించేందుకు పేర్ని నాని, కొడాలి నాని, రోజా.. ముందు వరుసలో ఉండేవారు. ఇటీవల వీరంతా ఎందుకో కాస్త వెనకపడ్డారు. పదే పదే పవన్ ని విమర్శించి జనసైనికులకు, ఆ సామాజిక వర్గానికి టార్గెట్ అవడం ఎందుకు అని అనుకున్నారేమో స్పీడ్ తగ్గించారు. వారాహి యాత్ర మొదలైన టైమ్ లో చెప్పులు చూపించిన పేర్ని నాని, యాత్ర ముగిసే సమయానికి కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేకపోవడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News