కిరాయి మాటల పవన్.. పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు
అసలు పవన్ ది ఆంధ్రప్రదేశ్ కాదా? రాజకీయం కోసమే ఆంధ్రప్రదేశ్ కావాలా? ఆయన తెలంగాణ వాళ్ళకి లొంగి పోయాడా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు పేర్ని నాని.
పవన్ కల్యాణ్ కిరాయి మాటలు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆయన కొత్తగా వకీల్ పాత్రలో ప్రవేశించారని చెప్పారు. వైసీపీ నేతలు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ వీడియో విడుదల చేసిన తర్వాత పేర్ని నాని వ్యూహాత్మకంగా ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ గతంలో బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలను తీసుకున్నారు. వాటిని ప్రదర్శిస్తూ, తనదైన శైలిలో వ్యాఖ్యానాలు జతచేరుస్తూ పవన్ ని తూర్పారబట్టారు. ఫైనల్ గా క్షమాపణ చెప్పాలంటే అది పూర్తిగా తమ వ్యక్తిగత అభిప్రాయమని, పవన్ మాటల్లోనే అది ఉందని అదే తమ జవాబు అని తేల్చి చెప్పారు.
వైసీపీ మంత్రుల్ని పవన్ టార్గెట్ చేసిన తర్వాత ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఇంటర్వ్యూ తీసుకుని సాక్షిలో వదిలారు. ఆ తర్వాత మాజీ మంత్రి పేర్ని నాని రంగప్రవేశం చేశారు. ప్రాంతాల గురించి పవన్ వ్యాఖ్యలు చేసినా కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారే వైసీపీనుంచి తెరపైకి వచ్చారు. పవన్ కి పద్ధతిగా కౌంటర్లిచ్చారు. పవన్ కి ఈ కొత్త బాధ ఏంటో తనకు అర్థం కావడంలేదన్నారు పేర్ని నాని.
మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ లో వ్యాపారాలున్నాయంటూ పవన్ బెదిరింపు ధోరణిలో మాట్లాడారని గుర్తుచేశారు పేర్ని నాని. అసలు పవన్ ది ఆంధ్రప్రదేశ్ కాదా? రాజకీయం కోసమే ఆంధ్రప్రదేశ్ కావాలా? ఆయన తెలంగాణ వాళ్ళకి లొంగి పోయాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ మంత్రి ఏపీని కించపరిస్తే అది వేరే ఇది అని పవన్ అంటున్నారని, ఇదెక్కడి లాజిక్ అన్నారు. ఇంతకు ముందు చంద్రబాబు, లోకేష్ ని ఏమైనా అంటే పవన్ వచ్చే వారని, పోనీ బీజేపీ నేతల్ని తిడితే పవన్ బైటకు వస్తే దానికో అర్థముందని, కానీ బీఆర్ఎస్ నేతల తరపున పవన్ వకాల్తా పుచ్చుకోవడాన్ని ఎలా చూడాలన్నారు పేర్ని నాని. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగిపోయిందని, అది తన ఘనతేనంటూ చెప్పుకున్న పవన్.. కేంద్రం ప్రైవేటీకరణ విషయంలో తగ్గేది లేదని స్పష్టం చేసిన తర్వాత ఎందుకు మాట్లాడటంలేదన్నారు. ఢిల్లీ వెళ్లాలి కదా, అమిత్ షా ని కలవాలి కదా అని ప్రశ్నించారు. ఇటీవల పవన్ ఢిల్లీ పర్యటనకు వ్యక్తిగత పనులే కారణం అని, అక్కడికి వెళ్లాక ఖాళీగా ఉన్న బీజేపీ మంత్రుల్ని కలిసి బిల్డప్ ఇచ్చారని విమర్శించారు పేర్ని నాని.