లోకేష్ ది అసత్య గళం.. పేర్ని కౌంటర్లు మొదలు

"5 ఏళ్ళల్లో 5 లక్షల ఉద్యోగాలను వాళ్ళ నాన్న ఇచ్చాడా, అమరావతిని పూర్తి చేయడంతో పాటు మోదీ మెడలు చంద్రబాబు వంచాడా..? లోకేష్ చెప్పినట్టు ఇవన్నీ చంద్రబాబు చేస్తే.. మరి ప్రజలెందుకు తండ్రీ కొడుకుల్ని ఖైమా ఖైమా చేసి ఇంటికి పంపించారు." అని పేర్ని నాని ప్రశ్నించారు.

Advertisement
Update:2023-01-27 21:42 IST

నారా లోకేష్ యువగళం తొలిరోజు ప్రసంగం పూర్తయిన తర్వాత వైసీపీ నుంచి యధావిధిగా కౌంటర్లు మొదలయ్యాయి. ముందుగా మాజీ మంత్రి పేర్ని నాని లోకేష్, చంద్రబాబుకి కలిపి ఫస్ట్ రౌండ్ కోటింగ్ ఇచ్చేశారు. యువగళం సభలో లోకేష్ మాట్లాడినవన్నీ అబద్ధాలేనని అన్నారు పేర్ని నాని. అయితే లోకేష్ భయం, బెరుకు లేకుండా బరితెగించి అబద్ధాలు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.

బందర్ పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్‌ టీడీపీ హయాంలో పూర్తి చేశారా అని ప్రశ్నించారు పేర్ని నాని. "5 ఏళ్ళల్లో 5 లక్షల ఉద్యోగాలను వాళ్ళ నాన్న ఇచ్చాడా, అమరావతిని పూర్తి చేయడంతో పాటు మోదీ మెడలు చంద్రబాబు వంచాడా..? లోకేష్ చెప్పినట్టు ఇవన్నీ చంద్రబాబు చేస్తే.. మరి ప్రజలెందుకు తండ్రీ కొడుకుల్ని ఖైమా ఖైమా చేసి ఇంటికి పంపించారు." అని పేర్ని నాని ప్రశ్నించారు. స్వయానా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే చంద్రబాబు చెత్త నాయకుడని, ఎందుకూ పనికి రాడని, అధికారంలోకి రాగానే కార్యకర్తలను పక్కన పెట్టేస్తాడని విమర్శిస్తున్నారని.. వాటికి లోకేష్ ఏమని సమధానం చెబుతారన్నారు.

బాబు ఫొటో ఎక్కడ..?

చంద్రబాబు బతికుండగానే ఆయన ఫొటో లేకుండా లోకేష్ రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారని, యువగళం ప్రచారంలో చంద్రబాబు ఫొటో ఎందుకు వాడుకోలేదని ప్రశ్నించారు పేర్ని నాని. అటు చంద్రబాబుకి కూడా కొడుకు లోకేష్ పై నమ్మకం లేదని, దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ పైనే బాబుకి నమ్మకం ఉందన్నారు. కానీ ఆ దత్తపుత్రుడేమో బీజేపీతో ఉంటూ చంద్రబాబుకు సైగ చేస్తుంటారని సెటైర్లు వేశారు.

అది మా దురదృష్టం..

ఏమాత్రం వ్యక్తిత్వం లేనివారితో తాము రోజూ పోరాటం చేయాల్సి వస్తోందని, నిజంగా అది తమ దురదృష్టం అని అన్నారు పేర్ని నాని. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, జగన్ తో పోరాటం చేయలేరన్నారు. జగన్ ని అంగుళం కూడా కదల్చలేరన్నారు. ఆ పార్టీలన్ని పొత్తు పెట్టుకున్నా.. వారికి అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఆ విషయం చంద్రబాబు, పవన్‌‌ కి బాగా తెలుసన్నారు. 

Tags:    
Advertisement

Similar News