ఖాళీ కుర్చీలకు మీటింగ్ చెప్పే సత్తా ఉన్న ఏకైక నాయకుడు
పనికి ఆహార పథకాన్ని పచ్చ చొక్కాలకు ఆహారం చేశారని, వారి మేత చూసి ప్రజలు విసిగిపోయి జగన్ కి అధికారం కట్టబెట్టారని చెప్పారు పేర్ని నాని.
ఏపీలో వైసీపీ పని అయిపోయిందని, టీడీపీదే ఇక రాజ్యమని చంద్రబాబు డప్పు కొట్టుకుంటున్నారని, కానీ వాస్తవంగా ఆయన సభలు, సమావేశాలు, రోడ్ షోలలో అసలు జనమే లేరని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. మచిలీపట్నం వచ్చే నైతిక అర్హత చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు. 2019లో ప్రజలు చంద్రబాబుని వదిలేస్తే.. 2023నాటికి టీడీపీ కేడర్ కూడా ఆయన్ను వదిలేసిందని ఆయన సభల్ని చూస్తే అర్థమవుతుందని చెప్పారు. అయితే ఖాళీ కుర్చీలకు కూడా గంటన్నర సేపు మీటింగ్ చెప్పగల సత్తా ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబేనని కితాబిచ్చారు.
వెన్నుపోటు రాజకీయాలు, ప్రజల్ని మోసం చేసి రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని ఎద్దేవా చేశారు పేర్ని నాని. బందరుని పోర్ట్ సిటీ చేస్తామని, రొయ్యల పరిశ్రమ తెస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని బందరు వచ్చారని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల పేరుతో యమ నొక్కుడు నొక్కారని, పనికి ఆహార పథకాన్ని పచ్చ చొక్కాలకు ఆహారం చేశారని, వారి మేత చూసి ప్రజలు విసిగిపోయి జగన్ కి అధికారం కట్టబెట్టారని చెప్పారు పేర్ని నాని.
ఆ పని చేయగలవా..?
2014నుంచి 2019 వరకు చంద్రబాబు పాలన నిజంగానే బాగుంది అనుకుంటే, అదే పాలన మళ్లీ తెస్తానని ప్రజలకు చెప్పి చంద్రబాబు ఓట్లు అడగగలడా అని ప్రశ్నించారు పేర్ని నాని. బావకోసం తండ్రిని కూడా కిరాతకంగా కూలదోసిన, తడిగుడ్డతో పీక కోసిన వారిని సైకో అనక ఇంకేమంటారని బాలకృష్ణపై పరోక్షంగా సెటైర్లు వేశారు. తోడల్లుడిని, వదినని మోసం చేసిన వాడిని సైకో అనక ఇంకేమంటారని చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5.. చంద్రబాబుని కప్పెట్టి చివరకు బంగాళాఖాతంలో కలిపారన్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని, ఈసారి కూడా అదే జరుగుతుందన్నారు.