కాపీ సినిమాలు ఎవరు చూస్తారు..? పవన్ కి పేర్ని నాని కౌంటర్లు
పవన్ కల్యాణ్ డబ్బింగ్ సినిమాలు, కాపీ సినిమాలు ఆపేసి.. వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చేయాలని సలహా ఇచ్చారు. పవన్ కి రూ.100 కోట్ల మార్కెట్టే లేనప్పడు రూ.30కోట్ల నష్టం ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు నాని.
పవన్ కల్యాణ్ ని వైసీపీ అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేదు. రెండురోజులపాటు పవన్ ఏపీలో పర్యటించి, రైతుల్ని పరామర్శించి, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసి, పొత్తులపై కాస్త క్లారిటీ ఇచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే. పవన్ పర్యటన ముగిసిన తర్వాత వైసీపీ విమర్శల వారోత్సవాలు మొదలు పెట్టింది. ఆల్రడీ ఫస్ట్ కోటింగ్ ఇచ్చేసిన మాజీ మంత్రి పేర్ని నాని, మరోసారి పవన్ పై చెణుకులు విసిరారు. తాజాగా ఆయన సినిమాలని కూడా టార్గెట్ చేశారు పేర్ని నాని. కాపీ సినిమాలు చేస్తే ఎవరు చూస్తారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ డబ్బింగ్ సినిమాలు, కాపీ సినిమాలు ఆపేసి.. వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చేయాలని సలహా ఇచ్చారు. భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో నష్టాలు వచ్చాయంటున్న పవన్ కి.. సినిమా బాగుంటేనే జనం చూస్తారనే విషయం తెలియదా అన్నారు. రూ.100 కోట్లు దాటిన పవన్ కల్యాణ్ సినిమా ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. పవన్ కి రూ.100 కోట్ల మార్కెట్టే లేనప్పడు రూ.30కోట్ల నష్టం ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు నాని.
టీడీపీ కోసమే జనసేన..
టీడీపీ కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని అన్నారు పేర్ని నాని. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబుకు అనుకూలంగా పవన్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తానొక్కడినే తెలివైన వాడిని అని పవన్ అనుకుంటారని సెటైర్లు విసిరారు. జగన్ ను తిట్టడం కోసమే పవన్ రోడ్డు మీదకు వస్తుంటారని ధ్వజమెత్తారు. 6 నెలలకు ఒకసారి పవన్ రోడ్డుపైకి వస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఆదేశాలతో పవన్, జగన్ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు నాని.
వారాహి ఎటు పోయింది పవన్..
ఎవరో టీ కొట్టు అతను వ్యాన్ ఇస్తే దానికి వారాహి అని పేరు పెట్టి హడావిడి చేశారని, ఇప్పుడు ఆ వారాహి ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేశారు పవన్ కల్యాణ్. పట్టుమని పది రోజులైనా రాష్ట్రంలో ఉండి ప్రజల కోసం పవన్ పని చేశారా అని ప్రశ్నించారు. పవన్ వి వీకెండ్ రాజకీయాలంటూ కామెంట్ చేశారు. వీకెండ్ లో రావటం, జగన్ ను, జనాలను తిట్టడం మళ్ళీ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోవటం.. ఇదే పవన్ పని అంటూ సెటైర్లు వేశారు. 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్, రోబో సినిమాలో రజినీకాంతా అని ప్రశ్నించారు. కులం పేరుతో రాజకీయం చేసే పవన్ ని కాపులు ఎప్పటికీ నమ్మబోరని చెప్పారు. రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చింది పవన్ కల్యాణే అన్నారు పేర్ని నాని.