స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ప్రజలు క్షమించరు.. - చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్‌ బహిరంగ లేఖ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉక్కు ఆస్తుల విక్రయాన్ని తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యతిరేకించాలని ఈఏఎస్‌ శర్మ తన లేఖలో డిమాండ్‌ చేశారు.

Advertisement
Update:2024-06-22 09:11 IST

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. కొత్త పార్లమెంట్‌ ప్రారంభం కాకుండానే కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చర్యలు వేగంగా చేపడుతుండటంపై ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆయన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ప్రజలంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారని పేర్కొన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉక్కు ఆస్తుల విక్రయాన్ని తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యతిరేకించాలని ఈఏఎస్‌ శర్మ తన లేఖలో డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం టీడీపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి కేంద్ర ప్రభుత్వ కుట్రను అడ్డుకుని, విశాఖ ఉక్కును నిలబెట్టేందుకు ప్రయత్నిస్తారని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశించారని, కానీ కేంద్ర వైఖరిలో మార్పు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు తన ఆధీనంలో ఉన్న ఉక్కు గనులను కేంద్రం కేటాయించి ఉంటే ప్లాంట్‌ ఎప్పుడో లాభాల బాట పట్టేదని, పెద్ద ఎత్తున స్టీల్‌ ఉత్పత్తులను సరఫరా చేసి ఉండగలిగేదన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వ చర్యల వల్లే స్టీల్‌ప్లాంట్‌ ఆర్థికంగా బలహీనపడిందని విమర్శించారు. పోరాటాల ద్వారా సాధించుకున్న స్టీల్‌ ప్లాంటును విక్రయిస్తే బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరని, వారి తరఫున తాను హెచ్చరిస్తున్నానని చంద్రబాబుకు రాసిన లేఖలో శర్మ స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News