పవన్ డైవర్షన్ రాజకీయాలను జనం గమనిస్తున్నారు - ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా

విశాఖలో జరిగే ప్రజాగర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ ఉత్తరాంధ్ర యాత్ర చేస్తున్నాడని మంత్రి దాడి శెట్టి రాజా మండిపడ్డారు.

Advertisement
Update:2022-10-12 12:27 IST

2014 నుండి పవన్ కళ్యాణ్ చేస్తున్న డైవర్షన్ రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో దేశంలో ఏ పార్టీ అధినేతకూ ఇవ్వని తీర్పు చెప్పు దెబ్బ కొట్టేలా పవన్‌కి ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖలో జరిగే ప్రజాగర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ ఉత్తరాంధ్ర యాత్ర చేస్తున్నాడని మంత్రి మండిపడ్డారు.

టిడిపి ఎమ్మెల్యేలకు దమ్ముంటే అమరావతి రాజధానికి మద్దతుగా రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేయాలని ఆయన సవాలు చేశారు. ఒక్కరు గెలిచినా తాము వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. లేదా చంద్రబాబు, అచ్చెం నాయుడులు మాత్రమే రాజీనామా చేసి.. వారిలో ఒక్కరు గెలిచినా చాలని, చంద్రబాబుకు ఇదే తన సవాల్ అని తేల్చి చెప్పారు.

రోడ్ల సమస్యపై మంత్రి మాట్లాడుతూ... వర్షాలు తగ్గిన వెంటనే రాష్ట్రంలో రోడ్లు వేయాలని సిఎం జగన్ ఆదేశించారని తెలిపారు. సిఎం ఆదేశాల మేరకు 2023 కల్లా రాష్ట్రంలో రోడ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని కోసం మరో రూ.1500 కోట్లు వెచ్చిస్తామని వివరించారు.

వైఎస్ఆర్ సిపి అధికారంలో వచ్చాక వేసిన రోడ్లు టిడిపికి, ఎల్లో మీడియాకి కనిపించవని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల నిర్మాణం కోసం ఏ ముఖ్యమంత్రి ఖర్చు పెట్టనంతగా సిఎం జగన్ ఖర్చు చేశారని మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు.

Tags:    
Advertisement

Similar News