ఏపీలో తొలి పండగ పెన్షన్ల పంపిణీ

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు నేరుగా జరుగుతున్న తొలి లబ్ధి ఇది. అందుకే ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Update: 2024-06-29 15:46 GMT

ఎన్నికల తర్వాత ఏపీలో పెన్షన్ల పంపిణీని కూటమి ప్రభుత్వం పెద్ద పండగలా నిర్వహించబోతోంది. స్వయంగా సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆయ చేతుల మీదుగా కొంతమంది లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తారని తెలుస్తోంది. జులై-1 ఉదయం 6 గంటలకు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం చంద్రబాబు లాంఛనంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తారు. మిగతా ప్రాంతాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు.. అధికారులతో కలసి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బకాయిలతో కలిపి జులై-1న లబ్ధిదారులకు రూ.7వేల రూపాయలు పెన్షన్ అందిస్తారు. ఆ తర్వాత నెలనెలా రూ.4వేలు పెన్షన్ ఇస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు నేరుగా జరుగుతున్న తొలి లబ్ధి ఇది. అందుకే ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


వైసీపీ హయాంలో పెన్షన్ల పంపిణీ సాఫీగా సాగిపోయింది. కొత్త పెన్షన్లు మంజూరైతే ఆ గ్రామ సర్పంచ్, లేదా వైసీపీ నేతల చేతుల మీదుగా తొలి పెన్షన్ ఇచ్చేవారు. ఆ తర్వాత వాలంటీర్లు ఒకటో తేదీ ఉదయాన్నే వచ్చి పెన్షన్లు పంపిణీ చేసేవారు. ఇటీవల ఎన్నికల సమయంలో బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్ జమ అయింది. ఇప్పుడు సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే తొలి నెల గరిష్టంగా రూ.7వేలు పెన్షన్ గా ఇస్తుండటంతో.. అధికారికంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గతంలో జగన్ హయాంలో కూడా ఆర్థిక సాయం పంపిణీ విషయంలో తొలి చెక్కుని ఆయనే అందించేవారు. ఎంపిక చేసిన కొంతమందికి సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు పెన్షన్ల పంపిణీకి నేరుగా సీఎం చంద్రబాబు క్షేత్ర స్థాయిలోకి రాబోతున్నారు. తొలిరోజే 90శాతం పంపిణీ పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టారు. మరి చంద్రబాబు ఫార్ములా.. వాలంటీర్లతో జరిగిన పంపిణీ విధానాన్ని మరిపిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News