రేపు అసెంబ్లీకి పెగాసస్ కమిటీ నివేదిక

గ‌త ప్ర‌భుత్వం సాధికార సర్వే ద్వారా ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త‌ సమాచారం సేకరించి దుర్వినియోగం చేసింద‌ని, దోషులను ప్రజల ముందు నిలబెడతామని గతంలోనే అధికార ప‌క్షం ప్రకటించింది.

Advertisement
Update:2022-09-19 16:49 IST

పెగాసస్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ లైబ్రరీ హాల్‌లో హౌస్‌ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి హౌస్ క‌మిటీ చైర్మ‌న్‌ భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి, స‌భ్యులు పార్థసారథి, అబ్బయ్య చౌదరి, మొండితోక జగన్మోహన్ రావు, జక్కంపూడి రాజా హాజరయ్యారు.పెగాసస్ తో పాటు ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యంపై కమిటీ విచారణ చేసింది. గతంలో రెండుసార్లు సమావేశమైన ఈ క‌మిటీ డేటా చౌర్యం జరిగినట్లు నిర్దారణకు వచ్చింది. వైసీపీ నాయకుల డేటా పలు ఐపీ అడ్రస్‌లకు వెళ్లినట్లు కమిటీ గుర్తించింది. దీనికి సంబంధించి ఓ నివేదిక సిద్ధం చేసింది. 85 పేజీలతో కూడిన ఈ నివేదికను రేపు సభలో ప్రవేశపెట్టనున్నారు.

గ‌త ప్ర‌భుత్వం సాధికార సర్వే ద్వారా ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త‌ సమాచారం సేకరించి దుర్వినియోగం చేసింద‌ని, దోషులను ప్రజల ముందు నిలబెడతామని గతంలోనే అధికార ప‌క్షం ప్రకటించింది. అప్పట్లో ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు టాప్ చేశారని, ఇది శాసనసభ నమ్మిందని ప్రకటించారు. పెగాసస్ మాత్రమే కాదు, ఇతర అన్ని అంశాలపై విచారణ చేస్తామని ప్రభుత్వం గతంలోనే చెప్పింది.

గత టీడీపీ హయాంలో చంద్రబాబు పెగాస‌స్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేశారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో హాట్‌టాపిక్ అయ్యాయి. ఏపీ అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరగ్గా.. ఈ వ్యవహారంపై అసెంబ్లీ హౌస్ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం హౌస్‌ కమిటీకి చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు. మ‌రికొంత‌మంది ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమించారు. దీనిపై దశలవారీగా జరిగిన సమావేశాలు,సేకరించిన సమాచారం ఆధారంగా సమగ్ర నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదిక‌ను రేపు సభలో ప్రవేశపెట్టి చర్చిస్తారు. తదుపరి తీసుకునే చ‌ర్య‌ల‌పై నిర్ణ‌యం తీసుకుంటార‌ని స‌మాచారం. 

Tags:    
Advertisement

Similar News