పథకాలకు కొత్త పేర్లు.. వారిద్దరికి పవన్ అభినందనలు

ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పటి వరకు జగనన్న గోరుముద్ద అనే పేరు ఉండేది. దీనికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అనే పేరు పెట్టారు.

Advertisement
Update:2024-07-28 11:13 IST

స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు హర్షణీయం.. అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుదీర్ఘ ట్వీట్ వేశారు. గత ప్రభుత్వంలో జగన్ తన పేరునే అన్ని పథకాలకు పెట్టుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఆయా పథకాలకు మహనీయుల పేర్లను పెట్టడం సంతోషకరం అని చెప్పారు. భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ ధన్యవాదాలు తెలిపారు.


కూటమి ప్రభుత్వం వచ్చాక హెల్త్ యూనివర్శిటీతోపాటు పలు పథకాలకు కూడా పేర్లు మార్చింది. కొన్నిటికి గతంలోనే ఉన్న పేర్లను కొనసాగించింది, మరికొన్నిటికి కొత్త పేర్లు పెట్టంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ ఉచితంగా ఇస్తోంది ప్రభుత్వం. దీనికి గతంలో జగనన్న విద్యాకానుక అనే పేరు ఉండేది, ఇకనుంచి ఈ పథకాన్ని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా పిలుస్తారు.

ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పటి వరకు జగనన్న గోరుముద్ద అనే పేరు ఉండేది. దీనికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అనే పేరు పెట్టారు. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలి అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్. డొక్కా సీతమ్మ దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు వారికి అలవడుతాయని ఆకాంక్షించారు పవన్.

ఇక విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలను ఇప్పటి వరకు జగనన్న ఆణిముత్యాలుగా పరిగణించేవారు. ఇకపై ఆ పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అనే పేరుతో పిలుస్తారు. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారని అన్నారు పవన్. ఆ మహనీయుల ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News