సెక్షన్ 30 పవన్‌ యాత్ర కోసం కాదు- పోలీసులు

అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, మైకులు వినియోగించే వారినే సెక్షన్ 30 అడ్డుకుంటుంది గానీ.. ముందస్తుగా అనుమతులు తీసుకుని సభలు సమావేశాలు నిర్వహించుకునే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని పోలీసులు చెబుతున్నారు.

Advertisement
Update:2023-06-12 09:15 IST

సెక్షన్ 30 పవన్‌ యాత్ర కోసం కాదు- పోలీసులు

ఈనెల 14 నుంచి కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పవన్‌ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అవుతోంది. ఈనేపథ్యంలో ఈ జిల్లాల పరిధిలో సెక్షన్ 30 అమల్లోకి తీసుకురావడంపై జనసేన విమర్శలకు దిగుతోంది. పవన్‌ పర్యటనకు ఇబ్బందులు కలిగించేందుకే సెక్షన్ 30ని ప్రయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈనెల 11నుంచి 30 వరకు సెక్షన్ 30 అమలులో ఉంటుందని పోలీసులు ప్రకటించారు.

పవన్‌ యాత్రకు మూడు రోజుల ముందు ఈ తరహా ఆదేశాలు ఇచ్చారంటే ముమ్మాటికీ యాత్రను అడ్డుకునేందుకేనని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే సెక్షన్ 30 ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విమర్శలను అమలాపురం ఎస్పీ తోసిపుచ్చారు. వారాహి యాత్ర నేపథ్యంలోనే సెక్షన్ 30 అమలు చేస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. సాధారణ చర్యల్లో భాగంగానే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, మైకులు వినియోగించే వారినే సెక్షన్ 30 అడ్డుకుంటుంది గానీ.. ముందస్తుగా అనుమతులు తీసుకుని సభలు సమావేశాలు నిర్వహించుకునే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని పోలీసులు చెబుతున్నారు. జనసేన అనుమతులు తీసుకుంటుంది కాబట్టి.. ఆ అనుమతులకు లోబడి యాత్రను కొనసాగిస్తే ఇబ్బంది ఉండదు కదా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. పైగా కోనసీమలో ఆ మధ్య గొడవలు జరిగిన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.

అటు పవన్ వారాహి యాత్ర నేపథ్యంలో ఏర్పాట్ల విషయంలో జనసేన నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు. అమలాపురం డీఎస్పీ వారాహి రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. పవన్‌ కల్యాణ్ సభ జరిగే ప్రాంతాన్నిజనసేన నేతలతో కలిసి పరిశీలించారు. పలు సూచనలు చేశారు.

Tags:    
Advertisement

Similar News