పాపం పసివాడు.. వైఎస్ జగన్‌కి ట్విట్టర్‌లో పవన్ కౌంటర్
ఎవరైనా జగన్‌తో పాపం పసివాడు సినిమా తీస్తే చాలా బాగుంటుంది. కానీ, ఇప్పుడు సినిమా తీయడానికి ఇసుక దిబ్బలు కావాలి. మరి ఎలా ఇప్పటికే రాష్ట్రంలో నదుల ఒడ్డున ఉన్న ఇసుకని వైసీసీ నేతలు దోచుకుంటున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ తనపై బాపట్లలో చేసిన వ్యాఖ్యలకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. రాజకీయ పార్టీ పెట్టి 10 ఏళ్లు అవుతున్నా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పెట్టలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని బాపట్ల జిల్లా నిజాంపట్నం సభలో వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. అలానే దత్తపుత్రిడిగా పవన్‌ని సంభోదిస్తూ సీఎం పదవి వద్దని దోపీడీ వాటా చాలని అంటున్నాడంటూ ఆరోపణలు గుప్పించారు.
అలానే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తు రాదని.. కేవలం వెన్నుపోటు మాత్రమే గుర్తుకు వస్తుందని విమర్శలు చేశారు. ఇక దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రెండు సినిమాల మధ్య విరామంలో వచ్చి పొలిటికల్ మీటింగ్ పెట్టి వెళ్లిపోతారు అని సెటైర్ వేశారు. రాష్ట్రంలో దోచుకోవటం ఆ తర్వాత దోచుకున్నది పంచుకుని హైదరాబాద్‌లో ఉండటం వీరి పని అంటూ సీఎం జగన్ ఘాటు విమర్శలు గుప్పించారు.
సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఎవరైనా జగన్‌తో పాపం పసివాడు సినిమా తీస్తే చాలా బాగుంటుంది. కానీ, ఇప్పుడు సినిమా తీయడానికి ఇసుక దిబ్బలు కావాలి. మరి ఎలా ఇప్పటికే రాష్ట్రంలో నదుల ఒడ్డున ఉన్న ఇసుకని వైసీసీ నేతలు దోచుకుంటున్నారు. ఇక సినిమా పోస్టర్‌లో ఉన్న పిల్లాడు సూట్‌కేస్‌తో నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఇక్కడ కూడా మార్పులు చేయాలి. అక్కడ సూట్‌కేస్‌కి బదులు.. సూట్‌కేసు కంపెనీలు పెట్టాలి. ఎందుకంటే జగన్ అక్రమ ఆర్జన, మనీ లాండరింగ్ సూట్‌కేస్ కంపెనీల ద్వారానే జరుగుతోంది. జగన్ ఏమీ కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా తరిమెల నాగిరెడ్డి కాదు. ఇక్కడ వర్గ యుద్ధం అనే పదాన్ని మాట్లాడే హక్కు కూడా జగన్‌కి లేదు. ఏదో ఒక రోజు రాయలసీమ మీ నుంచి విముక్తి పొందుతుంది’’ అని పవన్ కళ్యాణ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
బాపట్లలో జగన్ కాస్త ఎమోషనల్‌గా కూడా మాట్లాడారు. ‘‘రాబోవు ఎన్నికల్లో మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి. నేను కేవలం మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాను. నేను కేంద్రంలో ఎవరిని కలిసినా అది ఏపీ ప్రజల కోసమే. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్నది వాళ్లే. ఆ పార్టీలతో పెళ్లి చేసుకునేది.. ఆ తర్వాత విడాకులు ఇచ్చేది కూడా వాళ్లే’’ అంటూ విమర్శించారు.