పొత్తు ధర్మం.. జనసైనికులకు పవన్ హెచ్చరిక
సొంత పార్టీ నేతలకే పవన్ హెచ్చరికలు జారీ చేశారు. పొత్తు ధర్మానికి భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ఆమధ్య టీడీపీ సభల్లో జనసేన జెండాలు కనపడితే తీసి పక్కనపడేసేవారు, జనసేన నినాదాలు చేస్తే చితగ్గొట్టేవారు, అప్పుడు మాత్రం పవన్ సైలెంట్ గానే ఉన్నారు. కానీ జనసైనికులు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేస్తే మాత్రం ఆయనకి పొత్తు ధర్మం గుర్తుకొస్తోంది, సొంత పార్టీ నేతలకే ఆయన హెచ్చరికలు జారీ చేశారు. పొత్తు ధర్మానికి భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈమేరకు పవన్ కల్యాణ్ పేరుతో జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
జనసేన శ్రేణులు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉందని అంటూనే.. కొంతమంది దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పవన్. జనసేన నాయకులెవరైనా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తు ధర్నానికి తూట్లు పొడిస్తే పార్టీ పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా మూడు పార్టీలు క్షేత్ర స్థాయి నుంచి ముందుకు వెళ్ళాలని సూచించారు.
విశాల ప్రయోజనాలు..
రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీలో విపక్ష కూటమి ఏర్పాటు చేశామంటున్నారు పవన్. పొత్తులో భాగంగా పార్టీ కోసం చేసిన త్యాగాలు రాష్ట్ర సౌభాగ్యం, అభివృద్ధి కోసమేనన్నారు. పొత్తు ధర్మాన్ని పాటిద్దాం.. మిత్రపక్ష కూటమిని గెలిపిద్దామని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. అంతా బాగానే ఉంది కానీ, ఈ త్యాగాలన్నీ జనసేనకేనా అనే కామెంట్లు వినపడుతున్నాయి. ప్రతిసారీ జనసేన నాయకులే త్యాగాలు చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ బలంగా ఉన్న చోట్ల టికెట్లు ఇవ్వకుండా.. ఒకవేళ ఇచ్చినా వలస నాయకులకు పెద్దపీట వేయడం న్యాయమేనా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు బదులివ్వలేక, ఈ ఒత్తిడి తట్టుకోలేక పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేసినట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ పవన్ కాస్త గట్టిగానే హెచ్చరికలు జారీ చేయడం విశేషం.