వారాహి మళ్లీ మొదలు.. అక్టోబర్-1నుంచి నాలుగో విడత
ఈసారి పవన్ కు పసుపు జెండాలు కూడా స్వాగతం పలికే అవకాశముంది. పసుపు జెండాల మధ్యలో చంద్రబాబు, లోకేష్ ని పొగుడుతూ, వైసీపీని విమర్శిస్తూ పవన్ ఎలాంటి ప్రసంగాలు చేస్తారో వేచి చూడాలి.
రాజమండ్రి జైలులో టీడీపీతో పొత్తు ఖరారు చేసుకున్న పవన్ కల్యాణ్ ఆ తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు గ్యాప్ ఇచ్చి సినిమా షూటింగ్ లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడంతో మళ్లీ వారాహితో రోడ్డెక్కడానికి సిద్ధమయ్యారు. వారాహి తాజా షెడ్యూల్ ని జనసేన అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్-1నుంచి వారాహి నాలుగో విడత మొదలు కాబోతోంది.
ఈసారి పవన్ కి పని ఎక్కువే..
పవన్ కల్యాణ్ వారాహి నాలుగో విడత అక్టోబర్ 1న ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి మొదలవుతుంది. ఈసారి ఆయన అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు... నియోజకవర్గాలను కవర్ చేస్తారు. ఇందులో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, పెడన ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి జోగి రమేష్.. పవన్ పై ఓ రేంజ్ లో మాటల దాడి చేస్తున్నారు. వీరిద్దరికీ ఆయా నియోజకవర్గాలనుంచే పవన్ కల్యాణ్ సవాళ్లు విసిరే అవకాశముంది. ఇక అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు.. గురించి కూడా పవన్ సమాచారం సేకరించి పెట్టుకున్నారు. గతంలో పవన్ వారాహి యాత్ర మొదలవగానే పేర్ని నాని కూడా పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ కౌంటర్లు ఇచ్చారు. ఈసారి పవన్, పేర్ని నియోజకవర్గం నుంచే విమర్శలు ఎక్కుపెట్టే అవకాశముంది. పేర్ని నాని, జోగి రమేష్ ఇద్దరికీ ఈ దఫా పవన్ మరింత పని పెట్టే అవకాశముంది.
జనసేన మీటింగ్ లకు టీడీపీ శ్రేణులు..
టీడీపీతో పొత్తు ఖాయం అని ఆల్రడీ తేల్చేశారు పవన్. ఈ ప్రకటన తర్వాత తొలిసారి ఆయన వారాహి వాహనం ఎక్కుతున్నారు. ఈసారి ఆయనకు పసుపు జెండాలు కూడా స్వాగతం పలికే అవకాశముంది. పసుపు జెండాల మధ్యలో చంద్రబాబు, లోకేష్ ని పొగుడుతూ, వైసీపీని విమర్శిస్తూ పవన్ ఎలాంటి ప్రసంగాలు చేస్తారో వేచి చూడాలి. గతంలో జనసేన అధికారంలోకి వస్తే అని చెప్పుకొచ్చిన పవన్, ఈసారి టీడీపీతో కలసి అధికారం పంచుకోవాలనుకుంటున్నారు. మరి ఆయన అజెండా ఏంటో కూడా చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందా, లేక టీడీపీ మేనిఫెస్టోకే పవన్ జై కొడతారా అనేది వేచి చూడాలి. పొత్తులు, ఉమ్మడి కార్యాచరణపై వారాహి తాజా యాత్రలో మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.