సీఎం జగన్ పై పవన్ సంచలన ట్వీట్
విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉన్న సమయంలో ఓ పత్రికలో వచ్చిన శీర్షిక తనను ఆకర్షించిందని చెబుతూ పవన్ ఈ ట్వీట్ వేశారు.
వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ని చాలా పొదుపుగా వాడే పవన్ కల్యాణ్.. అప్పుడప్పుడు సీఎం జగన్ పై తన అక్కసు వెళ్లగక్కేందుకు మాత్రం దాన్ని ఉపయోగిస్తుంటారు. తాజాగా మరోసారి పవన్ అలాంటి ట్వీట్ వేశారు. సీఎం జగన్ ని జైలుకు పంపించే టైమ్ దగ్గరపడిందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికల ముందే ఆయన జైలుకి వెళ్తారా, లేక ఎన్నికల తర్వాతా అనేది తేలాల్సి ఉందని వెటకారం చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది.
ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ ని కించపరిచేలా ఆయన మాట్లాడుతున్నారని కంప్లయింట్ ఇచ్చారు. అయినా కూడా పవన్ తన పద్ధతి మార్చుకోలేదు. జైలు-జగన్ అంటూ మరోసారి సంచలన ట్వీట్ వేశారు పవన్. దీనికి కౌంటర్లు కూడా బాగానే పడుతున్నాయి. ప్రతిపక్ష నేతల్ని జైలుకి పంపిస్తామంటూ కేంద్రంలోని బీజేపీ బెదిరించడం సహజమేనని, అలాంటి బెదిరింపు రాజకీయాలకు భయపడేవాళ్లు వైసీపీలో ఎవరూ లేరని అంటున్నారు ఆ పార్టీ నేతలు.
విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉన్న సమయంలో ఓ పత్రికలో వచ్చిన శీర్షిక తనను ఆకర్షించిందని చెబుతూ పవన్ ఈ ట్వీట్ వేశారు. అవినీతిపరులు జైలుకి వెళ్తారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ ఆర్టికల్ ని ఆయన ప్రస్తావించారు. 'డియర్ వైసీపీ.. ఇది మీ ముఖ్యమంత్రికి కూడా వర్తిస్తుంది' అని కోట్ చేశారు పవన్. అయితే అది ఎన్నికలకు ముందా, లేక ఎన్నికల తర్వాతా అని అన్నారు. ఏపీలో కూటమిని గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు పవన్.