పవన్ తనని తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారా..?
నారా లోకేష్ పాదయాత్రను పొగుడుతూ.. జగన్ యాత్రని గుర్తు చేశారు పవన్. లోకేష్ ది జగన్ లాగా బుగ్గలు నిమిరే యాత్ర కాదని అన్నారు. ఇది మాటల యాత్ర కాదు, చేతల యాత్ర అని అన్నారు.
"పాదయాత్రలో ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకోవచ్చు. సాధకబాధకాలు తెలుసుకోవచ్చు. ఎవరైనా పాదయాత్రలు చేస్తే అసూయగా ఉంటుంది. నేను నడుద్దామంటే నడవనిచ్చే పరిస్థితి ఉండదు. నాకు రాని అవకాశాన్ని లోకేష్ దిగ్విజయంగా పూర్తి చేయడం ఆనందంగా ఉంది." అంటూ యువగళం ముగింపు సభలో ప్రసంగించారు పవన్ కల్యాణ్. తాను యాత్రలు చేద్దామన్నా తన అభిమానులు చేయనిచ్చే పరిస్థితి లేదని, అంతమంది జనం ఆయన కోసం వస్తారని, ట్రాఫిక్ జామ్ అవుతుందని, ఊళ్లు స్తంభించిపోతాయని, రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోతాయనేది పవన్ కల్యాణ్ ఊహ. గతంలో కూడా పవన్ ఇలాంటి కామెంట్లలు చాలానే చేశారు. రెండు నియోజకవర్గాల్లో పోటీచేసి ఓడిపోయిన తర్వాతయినా ఆయన ఆలోచనలు మాత్రం మారలేదు, ఓడిపోయి నాలుగున్నరేళ్లు దాటినా ఇంకా పవన్ తనని తాను అతిగా ఊహించుకోవడం ఆపలేదు. అందుకే ఇలాంటి స్టేట్ మెంట్లిస్తున్నారు.
జగన్ పై వెటకారం..
అవకాశం దొరికినప్పుడల్లా సీఎం జగన్ ని వెటకారం చేయడానికే ఉత్సాహం చూపిస్తుంటారు పవన్ కల్యాణ్. నారా లోకేష్ పాదయాత్రను పొగుడుతూ.. జగన్ యాత్రని గుర్తు చేశారు పవన్. లోకేష్ ది జగన్ లాగా బుగ్గలు నిమిరే యాత్ర కాదని అన్నారు. ఇది మాటల యాత్ర కాదు, చేతల యాత్ర అని అన్నారు. అందుకే ఈ కార్యక్రమం లోకేష్ కు మాత్రమే ప్రత్యేకం కావాలనే ఉద్దేశంతో తాను దూరంగా ఉండాలనుకున్నానని చెప్పారు. కానీ ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానించడంతోనే తాను సభకు రావాల్సి వచ్చిందన్నారు. లోకేష్ ప్రత్యేకత నిలవాలనే తాను తక్కువగానే మాట్లాడుతున్నానన్నారు పవన్.
చంద్రబాబుని జైలులో ఎందుకు పెట్టారంటే..?
స్కిల్ స్కామ్ లో దొరికిపోవడం వల్లే చంద్రబాబు రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారనేది బహిరంగ రహస్యం. అయితే పవన్ కి మాత్రం అది ప్రతీకార చర్యగా కనిపించిందట. అప్పట్లో సోనియా, జగన్ ను జైలులో పెట్టించారని.. కాంగ్రెస్ నాయకులు తప్పు చేస్తే ఆ కక్షతో జగన్, చంద్రబాబును జైలులో పెట్టించడం ఏంటని ప్రశ్నించారు పవన్. చంద్రబాబును అన్యాయంగా జైలులో పెట్టినప్పుడు చాలా బాధ కలిగిందని.. ఆయన కుటుంబ సభ్యుల వేదన అర్థం చేసుకున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో పార్టీ పెట్టి పోటీ చేయకుండానే టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చానని గుర్తు చేశారు. ఏపీ ఆర్థికంగా స్థిరపడే వరకు పొత్తు కొనసాగాలని అనుకున్నానని, కానీ దురదృష్టవశాత్తు అభిప్రాయ భేదాలు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల 2019లో విడిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. అలా తాము విడిగా పోటీ చేయడం వల్లే జగన్ ప్రభుత్వం వచ్చిందని తనదైన శైలిలో వివరణ ఇచ్చారు జనసేనాని.