వాలంటీర్లతోపాటు వైఎస్సార్ పై కూడా సంచలన వ్యాఖ్యలు
గతంలో ఐఏఎస్, ఐపీఎస్ లతో తప్పులు చేయించి, వారిని జైళ్లకు పంపించారని, ఇప్పుడు వాలంటీర్లతో తప్పులు చేయిస్తున్నారని అన్నారు పవన్ కల్యాణ్. ఇటీవల వాలంటీర్లపై వచ్చిన దొంగతనం, మోసం ఆరోపణలకు సంబంధించిన ఉదాహరణలు చెప్పారు.
పవన్ కల్యాణ్ వారాహి పార్ట్-3 విశాఖలో మొదలైంది. జగదాంబ సెంటర్లో ప్రసంగించిన పవన్ కల్యాణ్ మరోసారి అధికార వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో గోదావరి జిల్లాలనుంచి వైసీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చిన పవన్, ఇప్పుడు విశాఖనుంచి కూడా వైసీపీని ఖాళీ చేయించాలన్నారు. విశాఖలో వైసీపీ గెలిస్తే దారుణాలు జరుగుతాయని తాను గతంలోనే చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతోందన్నారు పవన్. ఐదేళ్లు ఈ బాధ భరించాల్సిందేనన్నారు. రుషికొండను తవ్వేశారని, ఎర్రమట్టి దిబ్బలను దోచేస్తున్నారని విమర్శించారు పవన్.
వైఎస్ఆర్ పై సంచలన వ్యాఖ్యలు..
"ఈరోజు నేను ఏం మాట్లాడతానోనని కోపంగా, నా గొంతు నులిమేద్దాం అని చూస్తున్న వైసీపీ నాయకులకు నమస్కారం" అంటూ విశాఖ జగదాంబ సెంటర్లో తన ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్, ఈ దఫా దివంగత నేత వైఎస్ఆర్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సాధనకు ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములుని మనం మరచిపోయామని, అడ్డగోలుగా దోచుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు మాత్రం రాష్ట్రమంతా పెట్టుకున్నామని అన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలని తానొక్కడిని అనుకుంటే సరిపోదని, ప్రజలు అనుకోవాలని, మీరు అనుకోండి అని చెప్పారు పవన్.
వైసీపీ గూండాలు..
ఏపీలో 30వేలమంది అమ్మాయిలు, మహిళలు అదృశ్యమయ్యారని చెబితే వైసీపీ గూండాలు తనను తిట్టారని, ఆ తర్వాత కేంద్ర మంత్రి పార్లమెంట్ లో అవే మాటలు చెప్పారని అన్నారు పవన్ కల్యాణ్. నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి కూడా ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ అని చెప్పారని గుర్తు చేశారు.
వాలంటీర్లూ మీరు జాగ్రత్త..
వాలంటీర్ వ్యవస్థలో ఉన్న లోపాల గురించి తాను మాట్లిడితే తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు పవన్ కల్యాణ్. వాలంటీర్ల పొట్ట కొట్టాలని తనకు ఏమాత్రం లేదని, ఆ విషయాన్ని తాను సింహాద్రి అప్పన్న సాక్షిగా చెబుతున్నానని అన్నారు. అవసరమైతే వాలంటీర్లకు ఇంకో 5వేల రూపాయలు ఎక్కువ ఇవ్వాలనే మనస్తత్వం తనదని చెప్పారు. కానీ జగన్ వారికి రూ.5వేలు ఇస్తూ తప్పులు చేయిస్తున్నారని, ప్రజల ఆధార్, బ్యాంక్ డిటెయిల్స్, ఇతర వ్యక్తిగత వివరాలు సేకరించి నానక్ రామ్ గూడ లోని ఆఫీస్ కి పంపిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్ లతో తప్పులు చేయించి, వారిని జైళ్లకు పంపించారని, ఇప్పుడు వాలంటీర్లతో తప్పులు చేయిస్తున్నారని అన్నారు. ఇటీవల వాలంటీర్లపై వచ్చిన దొంగతనం, మోసం ఆరోపణలకు సంబంధించిన ఉదాహరణలు చెప్పారు పవన్ కల్యాణ్.