దూకుడు తగ్గించిన పవన్ కల్యాణ్.. జనసైనికుల్లో నైరాశ్యం

వారాహి గురించి జనసైనికులు చాలా గొప్పగా చెప్పుకున్నారు. పవన్ కల్యాణ్ వస్తున్నారు, ఇక ఏపీ రాజకీయాల్లో ఆయనకు తిరుగే లేదన్నారు. వాహనం రెడీ చేసినంత స్పీడ్ గా దాన్ని జనాల్లోకి మాత్రం తీసుకు రాలేకపోయారు పవన్.

Advertisement
Update:2023-04-28 15:57 IST

పవన్ కల్యాణ్ జనాల్లోకి వస్తారా, రారా..? వస్తే ఎప్పుడు..? ఈ ప్రశ్నలు ఇప్పుడు జనసైనికుల్ని వేధిస్తున్నాయి. ఆమధ్య వారాహి వాహనం విషయంలో హడావిడి చేసిన జనసైనికులు ఇప్పుడు పూర్తిగా చప్పబడ్డారు. పవన్ కల్యాణ్ అటు సినిమాలతో బిజీ అయ్యారు, త్వరలో పోలవరం పర్యటన అంటున్నారు.. ఒకవేళ పవన్, పోలవరం ప్రాజెక్ట్ పర్యటనకు వచ్చినా జరిగేదేంటి..? వైసీపీని విమర్శిస్తారు, కేంద్రానికి సలహాలిస్తారు. దానివల్ల జనసేనకు కలిగే లాభమేంటి.. కొత్తగా ఏపీ ప్రజలు తెలుసుకునేదేంటి..? జనసేనలో నెలకొన్న సైలెన్స్ త్వరలో అయోమయంగా మారే ప్రమాదం కనపడుతోంది.

పొత్తులపై మీరు కంగారు పడొద్దు, అందరికీ నచ్చే నిర్ణయమే తీసుకుంటానని జనసైనికులకు భరోసా ఇచ్చారు పవన్ కల్యాణ్. కానీ ఆ నిర్ణయమేంటి, ఎంత త్వరగా తీసుకుంటారనేదే ఇప్పుడు అసలు సమస్య. తీరా టికెట్ ఆశిస్తున్నవారు జనాల్లోకి వెళ్లి ప్రచారం చేస్తూ, చివరిదాకా జనసేన కోసం తిరిగితే అప్పుడు పవన్ పొత్తులకోసం ఆ సీటు త్యాగం చేస్తే ఉపయోగమేంటి..? ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే టైమ్ ఉంది. ఇంకా పవన్ స్పీడ్ పెంచకపోతే జనసేనకు ఉపయోగమేంటి..?

జనసేన టికెట్ ఆశిస్తున్నవారి సంగతి పక్కనపెడతాం, కనీసం పవన్ కల్యాణ్ అయినా తన నియోజకవర్గాన్ని ఖరారు చేసుకున్నారా..? ఇదే ఇప్పుడు అర్థం కావడంలేదు. పవన్ కల్యాణ్ ఈసారి కూడా కచ్చితంగా బరిలో దిగాల్సిందే, వెనక ఉండి నడిపిస్తాను అంటే జనసైనికులు ముందుగానే నిరాశలో కూరుకుపోతారు. అందుకే ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలి. దానికి తగ్గ ఏర్పాట్లు పవన్ చేసుకుంటున్నారనే సమాచారం కూడా లేదు. కనీసం ఆయన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారనే ప్రకటన కూడా రాలేదు.

వారాహి బయటకు వస్తుందా రాదా..?

వారాహి గురించి జనసైనికులు చాలా గొప్పగా చెప్పుకున్నారు. పవన్ వస్తున్నారు, ఇక ఏపీ రాజకీయాల్లో ఆయనకు తిరుగే లేదన్నారు. వాహనం రెడీ చేసినంత స్పీడ్ గా దాన్ని జనాల్లోకి మాత్రం తీసుకు రాలేకపోయారు పవన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో పూజలు చేయించారు కానీ, ఇప్పుడు దాన్ని షెడ్డులోనే పెట్టారు. ఒకదానిపై ఒకటి కొత్త సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా మారిపోయిన పవన్, వారాహి ఎక్కి జనంలోకి ఎప్పుడు వస్తారా అని జనసైనికులు ఎదురు చూస్తున్నారు. లోకేష్ యువగళం పూర్తయ్యాక పవన్ వస్తారా, లేక ఆలోపే ఆయన షూటింగ్ లు ముగించుకుని వచ్చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News