తగ్గేదే లేదు.. వాలంటీర్లపై మళ్లీ సంచలన వ్యాఖ్యలు
రెవెన్యూ వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ ఉన్నా మళ్లీ వాలంటీర్లను ఎందుకు పెట్టారన్నారు పవన్. వాలంటీర్లను ఇప్పుడు పట్టించుకోకపోతే వారు ఐఏఎస్ ల కంటే ఎక్కువగా ప్రవర్తిస్తారన్నారు.
వాలంటీర్లకు తాను వ్యతిరేకం కాదంటూనే.. మరోసారి వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. గ్రామాల్లో ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉన్నారా, వితంతువులు జాగ్రత్తగా ఉన్నారా అనే విషయాన్ని వీర మహిళలు గమనించాలని, దెందులూరుతో ఇది ప్రారంభించాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. వాలంటీర్లు ఇంట్లోకి వచ్చి సమాచారమంతా తెలుసుకుంటున్నారని, ఎవరెవరు ఏం పని చేస్తారు..? ఎక్కడికి వెళ్తారు..? పిల్లలు ఎక్కడ చదువుతున్నారనే విషయమంతా వారికి తెలుస్తోందని, అలా తెలియాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు.
ఇతర పార్టీల సానుభూతిపరులను వాలంటీర్లు బెదిరిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు పవన్. పేపర్ బిల్లులతో కలిపి వాలంటీర్లకు 5200 రూపాయలు ఇస్తున్నారని, ప్రభుత్వ సొమ్ముతో వాలంటీర్లకు జీతాలిస్తూ వారిని వైసీపీ కార్యకలాపాలకోసం వాడుకోవడమేంటని ప్రశ్నించారు. అందర్నీ తాను ఒకేగాటన కట్టడంలేదని, 100 పండ్లు ఉన్న బుట్టలో ఒకటి కుళ్లిపోయినా అన్నీ పాడైపోతాయన్నారు.
ఇన్ని వ్యవస్థలున్నా ఇంకా వాలంటీర్లు ఎందుకని ప్రశ్నించారు పవన్. రెవెన్యూ వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ ఉన్నా మళ్లీ వాలంటీర్లను ఎందుకు పెట్టారన్నారు. వాలంటీర్లను ఇప్పుడు పట్టించుకోకపోతే వారు ఐఏఎస్ ల కంటే ఎక్కువగా ప్రవర్తిస్తారన్నారు. వాలంటీర్ వ్యవస్థను ప్రతి గ్రామంలోని ప్రజలు గమనించాలని, వారికి అవసరమైన సమాచారం మాత్రమే ఇవ్వాలన్నారు. వాలంటీర్లతో ఎంతోమంది ప్రతిభావంతులున్నారని, ఉన్నత విద్యావంతులున్నారని, వారందర్నీ 5వేల జీతంతో జగన్ ఎదగనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు పవన్.
ఎన్ని కేసులు పెట్టుకున్నా ఓకే..
తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా తాను పట్టించుకోనని చెప్పారు పవన్ కల్యాణ్. బయటకొస్తే తిరిగి ఇంటికి వెళ్తానో లేదో తనకు తెలియదని, కానీ తాను ఎవరికీ భయపడబోనని చెప్పారు. గత ఎన్నికల్లో కూడా తాను వైసీపీకి ఓట్లు వేయొద్దని చెప్పానని, కానీ ప్రజలు వినలేదని, ఈసారి కూడా అదే చెబుతున్నానని, హలో ఏపీ-బైబై వైసీపీ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు పవన్ కల్యాణ్.