పవన్ సీక్రెట్ మీటింగ్?

పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే రేస్ అనే సర్వే సంస్థ‌తో మీటింగుల కోసమే పార్టీ నేతలు ఎవరినీ రావద్దని చెప్పారట. రేస్ అనే సంస్థ‌ జనసేన పార్టీ తరపున రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లో సర్వే చేసింది, చేస్తోంది.

Advertisement
Update:2023-05-27 10:47 IST

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రెండు రోజులుగా సీక్రెట్ మీటింగులు పెట్టుకుంటున్నారట. హైదరాబాద్ నుండి గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. పవన్ మంగళగిరికి వస్తున్న విషయం పార్టీలోని చాలామందికి తెలియ‌దట. ఆపీసుకు పవన్ వచ్చారని తెలుసుకున్న కొద్దిమంది నేతలు తాము ఆఫీసుకు చేరుకోవాలని అనుకుంటే రావద్దన్నారని సమాచారం. ఈ విషయమే పార్టీలోని నేతలను అయోమయంలో పడేసింది.

మామూలుగా పవన్ ఎప్పుడొచ్చినా భారీఎత్తున ర్యాలీలు, జిందాబాదులతో గన్నవరం విమానాశ్రయం నుండి మంగళగిరి ఆఫీసు వరకు చాలా హడావుడి జరిగే విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది రోటీన్‌కు భిన్నంగా ఎవరికీ తెలియ‌కుండా సీక్రెట్‌గా ఉంచటమే ఆశ్చర్యంగా ఉంది. అయితే పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే రేస్ అనే సర్వే సంస్థ‌తో మీటింగుల కోసమే పార్టీ నేతలు ఎవరినీ రావద్దని చెప్పారట. రేస్ అనే సంస్థ‌ జనసేన పార్టీ తరపున రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లో సర్వే చేసింది, చేస్తోంది.

ప్రాంతాలవారీగా పార్టీ బలాన్ని, ఎన్నినియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది ? ఒంటరిగా పోటీ చేస్తే పార్టీ పరిస్థితి ఏమిటి? పొత్తుల్లో ముఖ్యంగా టీడీపీతో కలవటం వల్ల ఉపయోగాలు ఏమిటి? టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో కాపుల మనోభావాలు ఏమిటి? పొత్తు పెట్టుకుంటే జనసేన-టీడీపీ మధ్య ఓటు ట్రాన్స్ ఫర్ అవుతుందా అనే అంశాలపై సంస్థ విస్తృతంగా సర్వే చేసిందట. దానికి సంబంధించిన నివేదికపై చర్చించేందుకే పవన్ సంస్థ‌లోని ముఖ్యులను మంగళగిరి పార్టీ ఆఫీసుకు రమ్మన్నారని తెలిసింది. బహుశా ఈ నివేదిక ఆధారంగానే పొత్తుల విషయాన్ని పవన్ నిర్ణయించుకుంటారేమో. సర్వే రిపోర్టు ప్రకారమే మొత్తం ఎన్ని సీట్లు అడగాలి? ఏ ప్రాంతంలో ఏ నియోజకవర్గాలు అడగాలి అనే విషయాన్ని ఫైనల్ చేసుకునే అవకాశముంది. అంటే పవన్ వైఖరి చూస్తుంటే తొందరలోనే పొత్తుల విషయాన్ని ఫైనల్ చేసుకోవాలని డిసైడ్ అయినట్లే అనిపిస్తోంది. మరి తెలంగాణ విషయాన్ని కూడా పవన్ సర్వే చేయించారా లేదా అనే విషయమై స్పష్టమైన సమాచారం లేదు.

Tags:    
Advertisement

Similar News