యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రా.. ఏపీకి 25 రాజధానులు..

ఏపీకి మూడు రాజధానులు సరిపోవు, జిల్లాకో రాజధాని చొప్పున 25 రాజధానులు ఏర్పాటు చేయండి అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఏపీని "యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్ర"గా ప్రకటించాలన్నారు.

Advertisement
Update:2022-10-11 14:29 IST

"దేనికి గర్జనలు" అంటూ వరుస ట్వీట్లతో సోమవారం వైసీపీ నేతలకు చురుకు పుట్టించిన పవన్ కల్యాణ్ ఈరోజు కూడా తగ్గేదే లేదంటూ ట్వీట్లు పెట్టారు. వైసీపీనుంచి ఘాటు విమర్శలు వస్తున్నా సరే పవన్ ట్వీట్లతో వారిని చికాకు పెట్టేందుకే నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. ఏపీకి మూడు రాజధానులు సరిపోవు, జిల్లాకో రాజధాని చొప్పున 25 రాజధానులు ఏర్పాటు చేయండి అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఏపీని "యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్ర"గా ప్రకటించాలన్నారు. ఏపీని వైసీపీ రాజ్యంగా మార్చుకోవ‌డానికి ఏమాత్రం మొహమాట పడొద్దంటూ సెటైర్లు వేశారు.

అభివృద్ధి వికేంద్రీకరణకోసం..

అభివృద్ధి ఒకేచోట ఉండకూడదు, వికేంద్రీకరణ జరగాలనే ఉద్దశంతో వైసీపీ మూడు రాజధానులు పెట్టాలనుకుంటే దాన్ని పరిమితం చేయడం ఎందుకని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే 25 రాజధానులు కావాల్సిందేనన్నారు. వైసీపీ నేతలంతా చట్టం, న్యాయం, రాజ్యాంగానికి అతీతులుగా వ్యవహరిస్తారని, మిగతా ప్రజల ఆలోచనలను వారు అస్సలు పట్టించుకోరని అన్నారు.

అది "మౌంట్ రష్ మోర్", ఇది "దిల్ మాంగే మోర్"..

అమెరికాలోని "మౌంట్ రష్ మోర్".. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, విశ్వాసాలకు చిహ్నం అంటూ ఆ ఫొటోని షేర్ చేశారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత విశాఖలోని రుషికొండని కూడా అలాగే మార్చేసి ఇది "మౌంట్ దిల్ మాంగే మోర్" అంటూ ఆ కొండపై వైసీపీ నేతలు ఉన్నట్టుగా ఓ కార్టూన్ ని షేర్ చేశారు. ఇది "ధన-వర్గ-కులస్వామ్యానికి చిహ్నం" అంటూ కామెంట్ పెట్టారు. పవన్ కల్యాణ్ ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ నేతలు ఈ ట్వీట్లపై మరింత ఘాటుగా స్పందించే అవకాశముంది.

Tags:    
Advertisement

Similar News