ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటా.. ఎందుకోసమో చెప్పిన పవన్ కళ్యాణ్
తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను ప్రజల కష్టం, రక్తం, స్వేదం నుంచి వచ్చే డబ్బును జీతం రూపంలో తీసుకున్నప్పుడల్లా బాధ్యత గుర్తుకు వచ్చేందుకు జీతం తీసుకుంటానని చెప్పారు.
పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జనసేనకు 21 స్థానాలు రావడంతో ఆయన సంతోషంలో ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ రాజకీయాల పట్ల వరుసగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పటికీ జీతం తీసుకోకుండా ఉంటారు. అయితే జీతం విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేకు వచ్చే జీతాన్ని తీసుకుంటానంటూ ప్రకటించారు.
జనసేన తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని తాను తీసుకుంటానంటూ ప్రకటించారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను ప్రజల కష్టం, రక్తం, స్వేదం నుంచి వచ్చే డబ్బును జీతం రూపంలో తీసుకున్నప్పుడల్లా బాధ్యత గుర్తుకు వచ్చేందుకు జీతం తీసుకుంటానని చెప్పారు. ఎమ్మెల్యేగా తనకు అందే జీతం ముఖ్యం కాదని.. అంతకుమించి తన సొంత సొమ్మును ప్రజల కోసం ఖర్చు చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విలువైన బాధ్యతలను ప్రజలు తనకు అప్పగించారని అన్నారు. జనసేన పార్టీ గోరంతదీపమైనప్పటికీ కొండంత వెలుగునిచ్చిందన్నారు. ప్రజలు బలమైన మార్పు కోరుకున్నారని, ప్రజల ఆకాంక్షలను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవన్ కళ్యాణ్ సూచించారు.