పవన్ స్పీడ్ మామూలుగా లేదు..
బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పవన్ కల్యాణ్ దాదాపు 10గంటలు సమీక్షలకోసం కేటాయించడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు అధికారులు.
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ తొలిరోజే సుదీర్ఘ సమీక్షలతో అధికారుల్ని ఆశ్చర్యపరిచారు. డిప్యూటీ సీఎం పోస్ట్ తో పాటు ఆయన కీలకమైన నాలుగు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలిరోజు మొత్తం 10 గంటలసేపు ఆయన సమీక్షలు నిర్వహించారు. ఆయా విభాగాల అధికారులతో కీలక అంశాలపై చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈరోజు ఉదయం గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పవన్ కల్యాణ్. మధ్యాహ్నం నుంచి అటవీ, పర్యావరణ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆయా శాఖల్లో అంశాల వారీగా అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆ వివరాలను జాగ్రత్తగా ఆయనే నోట్ చేసుకున్నారు. త్వరలోనే మరోసారి ఆయా శాఖల అధికారులతో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులతో గురువారం పవన్ సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది.
బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పవన్ కల్యాణ్ దాదాపు 10గంటలు సమీక్షలకోసం కేటాయించడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు అధికారులు. ఆయన ఓపికకు హ్యాట్సాఫ్ అని చెబుతున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారెవరైనా ఒకటి లేదా రెండు గంటలు లాంఛనంగా రివ్యూ మీటింగ్ లు పెడతారు. ఆ తర్వాత మరికొన్ని రోజులకు పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తొలిరోజే ఏకబిగిన 10గంటలసేపు వివిధ అధికారులతో సమీక్ష నిర్వహించడం విశేషం. పవన్ ఇదే హుషారు కొనసాగిస్తారా, లేక కాలం గడిచేకొద్దీ నిదానిస్తారా అనేది వేచి చూడాలి.