శాంతి భద్రతల అంశంపై అసెంబ్లీలో పవన్ స్పందన
రఘురామ కృష్ణంరాజుని తిట్టినా, హింసించినా కూడా ఆయన పెద్ద మనసుతో జగన్ అసెంబ్లీకి వస్తే పలకరించారని, ఆయన నుంచి తాము చాలా నేర్చుకోవాలన్నారు పవన్.
ఏపీలో శాంతి భద్రతల అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో స్పందించారు. ప్రస్తుతం ఏపీలో దాడులు జరుగుతున్నా.. అవి అధికారంలో ఉన్న పార్టీ నేతలపైనే అని తేల్చేశారు. అధికారంలోకి వచ్చినా వైసీపీ దాడులు ఆగడం లేదని కొందరు సభ్యులు చెబుతున్నారని, అయినా కూడా తాము ప్రతీకారాల జోలికి వెళ్లడం లేదన్నారు. చంద్రబాబు ఆమేరకు తమ అందరికీ వార్నింగ్ ఇచ్చారని, తాము కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటామన్నారు పవన్.
తప్పు చేసినట్టు తేలితే తనకైనా శిక్ష విధించాలంటున్నారు పవన్. తనతోపాటు ఎవరూ చట్టానికి అతీతులు కాదని, తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలన్నారు. తమ పార్టీ తరపున ఎవరూ తప్పుచేయరని హామీ ఇచ్చారు. ఎవరైనా అలా చేస్తే.. వారిని వదులుకోడానికి సైతం వెనకాడబోమన్నారు డిప్యూటీ సీఎం.
తిట్లు తిన్నా కానీ..
జగన్ హయాంలో తమలో చాలామంది బాధితులమేనని అన్నారు పవన్ కల్యాణ్. చంద్రబాబుని జైలులో పెట్టారని, స్పీకర్ పై కూడా కేసులు పెట్టారని, ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుని కూడా జైలులో పెట్టి హింసించారన్నారు. రఘురామ కృష్ణంరాజుని తిట్టినా, హింసించినా కూడా ఆయన పెద్ద మనసుతో జగన్ అసెంబ్లీకి వస్తే పలకరించారని, ఆయన నుంచి తాము చాలా నేర్చుకోవాలన్నారు పవన్.
కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కూడా హర్షం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈసారి రాజధాని విషయంలో రాజీ పడేది లేదన్నారు. ఎవరు వచ్చినా మార్పులు చేర్పులు లేకుండా అమరావతిని పటిష్టంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు.