జగన్ సమాధానం చెప్పాల్సిందే..! మళ్లీ పవన్ ప్రశ్నలు
మన అమ్మాయిలు, మహిళలు ఎందుకు తప్పిపోయారు? వారికి ఏం జరుగుతోంది? ఎవరు బాధ్యత తీసుకుంటారు? అని ట్విట్టర్లో ప్రశ్నించారు పవన్ కల్యాణ్.
ఏపీలో సీఎం జగన్ పాలనలో బాలికలు, మహిళలు పెద్ద సంఖ్యలో అదృశ్యమయ్యారని మరోసారి ఆరోపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇవి ఆరోపణలు కావని, పార్లమెంట్ సాక్షిగా బయటపడిన నిజాలని అన్నారు. ఏపీలో గత మూడేళ్లలో అదృశ్యమైన బాలికలు, మహిళల సంఖ్య 30,196 అని చెప్పారు పవన్. రాజ్యసభలో హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలనే తాను చెబుతున్నానని.. దీనికి ఏపీ డీజీపీ, హోం శాఖ బదులివ్వాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా అదృశ్యమైన మహిళలు, బాలికల వివరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా రాజ్యసభలో వెల్లడించారు. ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది మహిళలు అదృశ్యమయ్యారనే గణాంకాలతో ఆయన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019 నుంచి 2021 వరకు మూడేళ్ల కాలంలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యమైనట్టు కేంద్ర హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కో ఏడాది లెక్క తీస్తే.. ఏపీలో తప్పిపోయిన బాలికలు, మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. మన అమ్మాయిలు, మహిళలు ఎందుకు తప్పిపోయారు? వారికి ఏం జరుగుతోంది? ఎవరు బాధ్యత తీసుకుంటారు? అని ట్విట్టర్లో ప్రశ్నించారు పవన్ కల్యాణ్.
కేంద్ర హోంశాఖ గణాంకాలపై.. ఏపీ మహిళా కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా మాట్లాడుతుందా? ఏపీ మహిళా కమిషన్ ..హోంశాఖ, డీజీపీని వివరణ కోరుతుందా? ఏపీ మహిళా కమిషన్, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు పవన్. తాను చేసిన ఆరోపణలు నిజమని కేంద్ర హోంశాఖ గణాంకాలే చెబుతున్నాయన్న పవన్.. వెంటనే ఏపీ హోంమంత్రి, డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు.