చంద్రబాబుకి ఏమైనా జరిగితే..! పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ
పవన్ కూడా చంద్రబాబు తప్పుచేయలేదని మాత్రం చెప్పడంలేదు. ఆయన వయసుని దృష్టిలో పెట్టుకోండి, ఆరోగ్యాన్ని పట్టించుకోండి అని మాత్రమే చెబుతున్నారు. తన లేఖలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు.
చంద్రబాబుకి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అంటూ ఇప్పటి వరకూ ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేసేవారు. జైలులో ఆయన్ను ఇబ్బంది పెడుతున్నారని అనేవారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా వంతపాట మొదలు పెట్టారు. చంద్రబాబుకి ఏమైనా జరిగితేనా.. అంటూ ఆయన కూడా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.
చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు అంటూ ప్రభుత్వానికి సూచన చేస్తూ పవన్ కల్యాణ్ ఓ బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందన్నారు.
రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదని చెప్పారు. ఆయన వయసుని దృష్టిలో ఉంచుకోవాలని, ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఈ అంశంలో రాజకీయ కక్షసాధింపు ధోరణి సరికాదని చెప్పారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందితే దానికి జైళ్ల శాఖ వివరణ సరిగా లేదని, ప్రభుత్వం తరపున సజ్జల కూడా సరిగా మాట్లాడటం లేదని, ఈ వైఖరి సరికాదని హితవు పలికారు పవన్ కల్యాణ్. కోర్టులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సూచించారు.
పవన్ బాధ ఏంటి..?
చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఆయన కుటుంబ సభ్యులు చేసిన, చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని తేలిపోయింది. ఆయన బరువు తగ్గలేదు సరికదా పెరిగారు, డీహైడ్రేషన్ అంటూ చేస్తున్న రాద్ధాంతంలో కూడా పసలేదు, ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నా.. కుటుంబ సభ్యులు నిందలు ఆపకపోవడంతో నేరుగా వైద్యులతోనే ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు జైళ్లశాఖ అధికారులు. ఈ దశలో ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడటం మరీ విడ్డూరం. పవన్ కూడా చంద్రబాబు తప్పుచేయలేదని మాత్రం చెప్పడంలేదు. ఆయన వయసుని దృష్టిలో పెట్టుకోండి, ఆరోగ్యాన్ని పట్టించుకోండి అని మాత్రమే చెబుతున్నారు. తన లేఖలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు.