అందుకే ఆ శాఖ తీసుకున్నా.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

మడ అడవులు ప్రకృతి విపత్తుల నుంచి మానవాళికి రక్షణ కవచంగా ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం పవన్. మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement
Update: 2024-07-27 02:43 GMT

వైసీపీ హయాంలో పర్యావరణ రక్షణను గాలికొదిలేశారని విమర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. గత ప్రభుత్వం 110 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఉన్న మడ అడవులు తొలగించి గృహ నిర్మాణానికి అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూముల్లో మడ అడవులు ఉంటే వాటని అటవీ భూములుగా గుర్తించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మీడియా కూడా మడ అడవుల పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్.

పర్యావరణ పరిరక్షణపై తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని, అందకే అటవీశాఖ ఎంచుకున్నానని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్. పర్యావరణానికి ఎవరు హాని కలిగించినా దానిపై తాను వ్యక్తిగతంగా పోరాటం చేసేవాడినని గుర్తు చేశారు. పర్యావరణానికి హానిచేసే చర్యలను ఇప్పుడు ప్రభుత్వపరంగా మరింత సమర్థంగా అడ్డుకుంటామన్నారు. అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని రాష్ట్ర అటవీశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. మడ అడవుల రక్షణ, విస్తీర్ణం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రాబోయే అయిదేళ్లలో 700 హెక్టార్లలో మడ అడవుల విస్తీర్ణాన్ని పెంచాలని లక్ష్యంగాపెట్టుకున్నట్టు తెలిపారు పవన్ కల్యాణ్. ఈ పథకానికి 50శాతం కేంద్రం నిధులు ఇస్తుందని, 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పారు. ఎకో టూరిజం అభివృద్ధి చేయడం ద్వారా మడ అడవులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. మడ అడవులు ప్రకృతి విపత్తుల నుంచి మానవాళికి రక్షణ కవచంగా ఉన్నాయన్నారు. తుఫానులు, సునామీల నుంచి తీర ప్రాంతాలను కాపాడతాయన్నారు. మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు పవన్. 

Tags:    
Advertisement

Similar News