ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
ఏపీలో మూడు పార్టీలు కలసి పోటీ చేస్తే సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై కూడా పవన్ క్లారిటీ ఇచ్చారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని మరోసారి స్పష్టం చేశారు.
ఎన్డీఏ కూటమి సమావేశాలకు హాజరైన పవన్ కల్యాణ్ ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ, కలసి పోటీ చేసే అవకాశముందని చెప్పారు. వైసీపీని గద్దె దించాలంటే అందరూ కలసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు పవన్. జగన్ వద్దని ప్రజలంతా కోరుకుంటున్నారని, వారి కష్టాలు తీర్చేవారు కావాలని అనుకుంటున్నారని... ప్రతిపక్షాలు ప్రజల కోర్కెను నెరవేరుస్తాయని చెప్పారు పవన్.
సీఎం ఎవరు..?
ఏపీలో మూడు పార్టీలు కలసి పోటీ చేస్తే సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై కూడా పవన్ క్లారిటీ ఇచ్చారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలను బట్టి సీఎం ఎవరనేది నిర్ణయిస్తామమని చెప్పారు పవన్.
కూటమిపై క్లారిటి ఇదేనా..?
ఏపీలో మూడు పార్టీలు కలసి పోటీ చేయాలనేది పవన్ అభిమతంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే జనసేన బీజేపీతో జట్టుకట్టి ఉంది, కొత్తగా టీడీపీని ఈ కూటమిలో చేర్చుకోవాలంతే. కానీ టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్య కుదరడం అంత తేలిక కాదు. ఇటీవల చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల్ని కలిశారు. కానీ ఎలాంటి డీల్ సెట్ కాలేదు. కొత్తగా ఏపీలో పురంద్రీశ్వరిని పార్టీ అధ్యక్షురాలిగా నియమించి మరో ఎత్తుగడ వేసింది బీజేపీ. ఈ దశలో టీడీపీని, బీజేపీ దగ్గరకు తీస్తుందని అనుకోలేం. అందుకే ఎన్డీఏ కూటమి పార్టీల మీటింగ్ కి కూడా టీడీపీకి ఆహ్వానం లేదు. కానీ జనసేనానిని మాత్రం ఢిల్లీకి పిలిపించారు.
నారాయణ వ్యాఖ్యల అర్థం ఇదేనా..?
పవన్ కల్యాణ్ దళారీలా వ్యవహరిస్తున్నారని, టీడీపీ-బీజేపీ మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నారని సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ ఢిల్లీ పర్యటన కూడా దాదాపుగా దీన్నే నిరూపిస్తోంది. బీజేపీ-టీడీపీ కోసం ఆయన మధ్యవర్తిత్వం చేస్తున్నారని పొలిటికల్ వర్గాల సమాచారం.