పొత్తులపై విమర్శలు చేయొద్దు.. జనసేన నేతలకు పవన్ లేఖ
పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ఎవరైనా ప్రకటనలు చేస్తే అటువంటి వారి నుంచి వివరణ తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని, ఈ సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
పొత్తులపై విమర్శలు చేయవద్దని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఫేస్‌బుక్ పేజీలో ఓ లేఖ విడుదల చేశారు. జనహితం, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయవద్దని కోరారు.
ఇలాంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారవుతారని అన్నారు. పొత్తులకు సంబంధించి ఏవైనా అభిప్రాయాలు, సందేహాలు వ్యక్తం చేయాలనుకుంటే తన రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ దృష్టికి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ సూచించారు.
పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ఎవరైనా ప్రకటనలు చేస్తే అటువంటి వారి నుంచి వివరణ తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని, ఈ సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
పొత్తులో భాగంగా ప్రస్తుతం టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, జనసేన కూడా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించింది మొత్తం నాలుగు స్థానాలే అయినప్పటికీ ఇప్పటికే ఏయే స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలో చాలా వరకు నిర్ణయం కూడా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఎవరనే విషయంపై అనధికారికంగా సమాచారం ఇచ్చారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ దక్కని టీడీపీ, జనసేన నాయకులు ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఆయా స్థానాల్లో జనసేన పోటీ చేస్తే ఓటమి ఖాయమని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తుండగా.. జనసేన నాయకులు కూడా అటువంటి విమర్శలే చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి లేఖ విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఏ స్థానం నుంచి ఏ పార్టీ పోటీ చేసినా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని, విమర్శలకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు సూచించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పొత్తుల వల్ల కొందరు నాయకులు త్యాగాలు చేయాల్సి ఉంటుందని టికెట్ల కేటాయింపులకు సంబంధించి ఎవరూ విమర్శలు చేయవద్దని ఇప్పటికే పార్టీ నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది.