మీ భవిష్యత్తుని మీరే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నట్టు..
షర్మిల చీర కూడా కూటమికి ప్రచారాస్త్రంగా మారడం విశేషం. పవన్ తన ప్రసంగాల్లో పదే పదే అదే విషయాన్ని హైలైట్ చేశారు.
కూటమిని ప్రజలు నమ్మడంలేదని, చంద్రబాబు హామీలను అసలే నమ్మడంలేదని పవన్ కల్యాణ్ కు బాగా అర్థమైంది. అందుకే ఆయన ఇటీవల ప్రచారంలో శాపనార్థాలు పెడుతున్నారు. మాకు ఓటు వేయకపోతే మీ కర్మ మీరే అనుభవిస్తారంటూ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగుతాయా అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. ఏం చేయాలో తెలియక, ఎలా ప్రజల్ని నమ్మించాలో అర్థం కాక.. ఇప్పుడిలా పవన్ కల్యాణ్ తిట్ల దండకం అందుకుంటున్నారని, ప్రజల్ని తిడుతూ వారితో ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు నెటిజన్లు.
జగన్‌ను మళ్లీ గెలిపిస్తే మీ బంగారు భవిష్యత్తును మీరే పెట్రోలు వేసుకుని తగలబెట్టుకున్నట్టు అంటూ రాజోలు నియోజకవర్గంలో జరిగిన వారాహి విజయభేరి సభల్లో ప్రజలకు శాపనార్థాలు పెట్టారు పవన్ కల్యాణ్. వైసీపీకి ఓటు వేస్తే మీ నాశనాన్ని మీరే కొనితెచ్చుకున్నట్టని అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు భద్రత ఉండదని, యువతకు ఉపాధి అవకాశాలు రావని, రైతులకు గిట్టుబాటు ధర దక్కదని, ప్రైవేట్ ఆస్తుల డిజిటలైజేషన్ పేరుతో వాటిని జగన్ తాకట్టు పెట్టుకుంటారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయంపై కూటమి పెద్దగా ఫోకస్ పెట్టడంలేదు. అందుకే ఇలాంటి తిట్ల దండకాలు పవన్ నోటివెంట వస్తున్నాయి.
ఆమె చీర.. వీరికి ప్రచారాస్త్రం..
ఇక షర్మిల చీర విషయాన్ని కూడా పవన్ ప్రసంగంలో హైలైట్ చేయాలనుకోవడం విశేషం. సొంత చెల్లెలి దుస్తుల రంగుల గురించి జగన్ హేళన చేస్తూ మాట్లాడారని, తోడబుట్టిన చెల్లెలు ధరించిన దుస్తుల రంగులను ఎవరైనా చూస్తారా? పచ్చదనంపై ద్వేషం ఉంటే చెట్లను చూడడం మానేస్తామా? పసుపు రంగులో ఉన్నాయని బంతిపూలను విగ్రహాలకు వేయడం మానేస్తామా? అంటూ లాజిక్ లు చెప్పారు. గతంలో తన తల్లిని దూషించారని గగ్గోలు పెట్టిన పవన్ ఇప్పుడు అదే పార్టీ పంచలో చేరి, చంద్రబాబు చంకలో దూరి హాయిగా ఉన్నారు. అప్పటి పౌరుషం ఇప్పుడేమైంది పవన్ అంటూ నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. షర్మిలను అవమానించేలా గతంలో టీడీపీ నేతలు, ఎల్లో మీడియా చేసిన ప్రచారం పవన్ కి గుర్తులేదా అంటున్నారు. షర్మిల రాజకీయ రంగు బయటపెడితే.. చీర రంగు గురించి చెబుతున్నారంటూ విపరీతార్థాలు తీస్తున్నారు. తన రాజకీయ స్వలాభం కోసం షర్మిల దిగజారిపోవడంతోపాటు.. కూటమి చేతులో ఆమె పావుగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు నెటిజన్లు.