జగన్ గాయంపై పవన్ సంచలన వ్యాఖ్యలు..
జగన్ గాయం తర్వాత ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలన్నిటినీ నిన్న తెనాలి మీటింగ్ లో ఏకరువు పెట్టారు పవన్ కల్యాణ్.
సీఎం జగన్ కి గాయమైన తర్వాత చాలామంది నాయకులు సానుభూతి తెలిపారు. ప్రధాని మోదీ సైతం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం కనీసం ఓ ట్వీట్ కూడా వేయలేదు. పైగా నిన్న జరిగిన తెనాలి మీటింగ్ లో మరింత సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. సీఎం జగన్ కి గాయమైతే.. రాష్ట్రానికే గాయమైనట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బాపట్ల జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడ్ని చంపేసినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 వేలమంది ఆడబిడ్డలు అదృశ్యమైతే గాయం కాలేదా అని అన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు పవన్.
ఎల్లో మీడియా ప్రతినిధిలాగా..!
జగన్ గాయం తర్వాత ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలన్నిటినీ నిన్న తెనాలి మీటింగ్ లో ఏకరువు పెట్టారు పవన్ కల్యాణ్. జగన్ చుట్టూ భద్రత ఉందని, ఆపై జెండాలున్నాయని, అంత భద్రత ఉన్న సీఎంపై రాయి వేయడమా..? అని లాజిక్ తీశారు పవన్. మీరే దాడులు చేస్తారు.. మీపై దాడులా.. అని ప్రశ్నించారు. రాష్ట్ర డీజీపీ, నిఘా విభాగం ఏం చేస్తున్నట్లు అని అడిగారు. ‘నాన్నా పులి వచ్చే.. కథలా ఎన్నిసార్లు నమ్మాలి? నమ్మకం పోయింది. ఈ డ్రామాలు ఆపాలి’ అంటూ సెటైర్లు వేశారు పవన్.
ముఖ్యమంత్రిపై దాడి జరిగితే కనీసం సానుభూతి చూపకుండా ఇలా వెటకారంగా మాట్లాడటం సరికాదని పవన్ పై నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. పార్టీలు వేరయినా, నాయకుల మధ్య వ్యక్తిగత వైరం ఉండకూడదంటారు. కానీ జగన్ విషయంలో మాత్రం చంద్రబాబు, పవన్ కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.