పవన్ పై కుట్ర చేస్తున్నారు.. చంద్రబాబు ఆరోపణలు
పవన్ కల్యాణ్ హెలికాప్టర్ విషయంలో కుట్ర జరిగిందనేది చంద్రబాబు ఆరోపణ. హెలికాప్టర్ ప్రయాణానికి అధికారులు అడ్డుతగిలారని అంటున్నారు.
ఇటీవల బ్లేడ్ బ్యాచ్ దాడి అంటూ పవన్ కల్యాణ్ తనపై సింపతీ క్రియేట్ చేసుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు రంగంలోకి దిగారు. పవన్ హెలికాప్టర్ ని అడ్డుకుంటూ వైసీపీ కుట్రలకు తెరతీస్తోందని ఆరోపించారాయన. టీడీపీ, జనసేన కలసి ప్రజల్లోకి వెళ్తుంటే వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, అందుకే తమ ఇద్దరి పర్యటనలకు వారు ఆటంకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
అసలేం జరిగింది..?
పవన్ కల్యాణ్ హెలికాప్టర్ విషయంలో కుట్ర జరిగిందనేది చంద్రబాబు ఆరోపణ. అంబాజీపేట, అమలాపురంలో సభలకు హాజరయ్యేందుకు పవన్ రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో వెళ్లారు. అయితే ఆ హెలికాప్టర్ ప్రయాణానికి అధికారులు అడ్డుతగిలారని అంటున్నారు చంద్రబాబు. హెలికాప్టర్ నడపడానికి వచ్చిన వారిలో కో పైలట్ కి ఎయిర్ పోర్ట్ ఎంట్రీ పర్మిట్ లేదని ఆయన్ను బయటే ఆపేశారట. చివరకు చంద్రబాబు హెలికాప్టర్ కో పైలట్ వెళ్లడంతో ఆ సమస్య పరిష్కారమైందని అంటున్నారు చంద్రబాబు.
బేగంపేట ఎయిర్ పోర్ట్ లో కో పైలట్ కు తాత్కాలిక అనుమతి ఇచ్చారని, అలాంటి అనుమతి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో అడిగితే కుదరదన్నారని ఇదెక్కడి నిబంధన అని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అనుమతిలేని కో పైలట్ ని ఎయిర్ పోర్ట్ లోకి తీసుకెళ్లాలనుకోవడం పవన్ కల్యాణ్ చేసిన తప్పు. ఆ తప్పుని కవర్ చేయడానికి వైసీపీపై బురదజల్లాలనుకున్నారు చంద్రబాబు. హెలికాప్టర్ ని అడ్డుకున్నారని రచ్చ చేస్తున్నారు. ఎన్నికల వేళ ఏ చిన్న విషయాన్నయినా పెద్దది చేయడం, వైసీపీని తప్పుబట్టడం, ఎల్లో మీడియా ద్వారా దానికి విపరీత ప్రచారం కల్పించడం చంద్రబాబు వ్యూహంలో భాగమే. ఆమధ్య బ్లేడ్ బ్యాచ్ దాడి అంటూ పవన్ పూర్తిగా నిరాధార ఆరోపణలు చేశారు. ఇప్పుడు హెలికాప్టర్ ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారంటూ చంద్రబాబు సింపతీ క్రియేట్ చేయాలని చూశారు.