ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న పవన్ కల్యాణ్..
జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థలు బలోపేతమవుతాయన్నారు. వైసీపీ నాయకులు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారో అందరికీ తెలుసని, వారు ప్రధాని ముందు నోరు మెదపలేరని, అందుకే రాజకీయాల మార్పు గురించి ప్రజలు ఆలోచించాలని చెప్పారు.
పార్టీ నడపటానికి అర్హత వైసీపీకే ఉందా..? మాకు లేదా? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. ఒక్కసారి జనసేన వైపు చూడాలని ప్రజల్ని తాను కోరుతున్నానని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన జనసేనాని.. ఈసారి ప్రజలు జనసేనకు మద్దతివ్వాలని అభ్యర్థించారు. దేశం అభివృద్ధి చెందుతున్నా డబ్బు మాత్రం కొందరి వద్దే ఉండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థలు బలోపేతమవుతాయన్నారు. వైసీపీ నాయకులు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారో అందరికీ తెలుసని, వారు ప్రధాని ముందు నోరు మెదపలేరని, అందుకే రాజకీయాల మార్పు గురించి ప్రజలు ఆలోచించాలని చెప్పారు. జనసేన ఆవిర్భవించింది భావితరాల కోసమేనన్నారు పవన్. ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు మారవని చెప్పారు.
అందరి లెక్కలు తేలుస్తా..
నా తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తానంటూ గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ ఓ డైలాగ్ చెబుతారు. సరిగ్గా పొలిటికల్ సీన్ లో కూడా ఇప్పుడు అలాంటి డైలాగే చెప్పారు పవన్. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని, జనసేన అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తానని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక వైసీపీ నేతలు కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారని మండిపడ్డారు పవన్. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధిపై తాను ప్రశ్నిస్తుంటే, సీఎం జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం మాట్లాడేవారికి తగిన రీతిలో జవాబు చెప్పగలనని అన్నారాయన.
2009లోనే ఎంపీ అయిఉండేవాడిని...
తనకు అధికారం కావాలనుకుంటే 2009లోనే ఎంపీని అయి ఉండేవాడినన్నారు పవన్ కల్యాణ్. కానీ విలువలతో కూడిన రాజకీయం చేయడం వల్లే అప్పుడు పదవులు ఆశించలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసి అభివృద్ధి అంటోందని, జగన్ సీఎం అయ్యాక ఏపీకి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చెప్పాలన్నారు. ప్రజలు ఉపాధిలేక అల్లాడిపోతున్నారని, గుడివాడలో ఇసుక దందా నడుస్తోందని, చిత్తూరులో రౌడీయిజం రాజ్యమేలుతోందన్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని హితవు పలికారు.