ఇప్పటంలో ఇళ్ళు కోల్పోయినవారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం -పవన్
నైతిక మద్దతుతోపాటు ఆర్థికంగా కూడా అండగా నిలబడాలని లక్ష రూపాయల వంతున భరోసాను ఇప్పుడు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా అందజేస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మంగళగిరి నియోజక వర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కోల్పోయినవారు, దెబ్బతిన్నవారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు, ఆవాసాలు కోల్పోయిన వారికి లక్ష రూపాయలు వంతున ఆర్థికంగా అండగా నిలబడాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
మార్చి 14న ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఆ గ్రామస్తులు సహకరించారని, సభ నిర్వహించుకునేందుకు స్థలం ఇచ్చారని కక్షగట్టి శుక్రవారంనాడు జేసీబీలను పెట్టి, పోలీసులను మోహరింపచేసి ఇళ్ళు కూల్చినట్లు జనసేన ఆరోపించింది. ఘటన జరిగిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఇళ్ళు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని ఇప్పటంవాసుల గుండె నిబ్బరాన్ని చూసి చలించిపోయారు. బాధితులకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు. నైతిక మద్దతుతోపాటు ఆర్థికంగా కూడా అండగా నిలబడాలని లక్ష రూపాయల వంతున భరోసాను ఇప్పుడు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా అందజేస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.