ఉక్కు ప్రైవేటీకరణకు బ్రేక్.. క్రెడిట్ తనదేనంటున్న పవన్
కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గడానికి కారణం తామేనంటున్నారు పవన్ కల్యాణ్. విశాఖ స్టీల్ ప్లాంట్.. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలని జనసేన ఆకాంక్షిస్తోందని ప్రకటించారు.
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రం వెనకగుడు వేయడంతో ఇప్పుడీ వ్యవహారం రాజకీయ చర్చకు కారణమైంది. తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవడంతోపాటు రాజకీయ ఒత్తిడి పెంచడంతో కేంద్రం ఒకడుగు వెనక్కి వేసింది. అయితే ఇప్పుడీ క్రెడిట్ తమదేనని చెప్పుకోడానికి సిద్ధమయ్యాయి ఏపీలోని అధికార, విపక్షాలు. తాజాగా పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటన ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది.
ఆ ఘనత మాదే..!
కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గడానికి కారణం తామేనంటున్నారు పవన్ కల్యాణ్. విశాఖ స్టీల్ ప్లాంట్.. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలని జనసేన ఆకాంక్షిస్తోందని ప్రకటించారు. ప్రైవేటీకరణపై వార్తలు రాగానే అధికార పార్టీకంటే ముందు తాను స్పందించానన్నారు. వెంటనే ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనాయకత్వంతో కలిసి చర్చించానని, దీనిపై వారు సానుకూలంగానే స్పందించారని తెలియజేశారు. అప్పట్లో ఆ స్పందన ఎంతో ఆశావాహంగా కనిపించిందని, ఇప్పుడు దాని ఫలితం తెలిసిందని అన్నారు పవన్. నేరుగా క్రెడిట్ తనదేనని పవన్ చెప్పుకోకపోయినా, ఆయన ప్రకటన సారాంశం మాత్రం అదే.
ప్రైవేటీకరణపై ముందుకెళ్లడంలేదు అంటూ కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ప్రకటించగానే జనసేన నుంచి వరుస ట్వీట్లు పడ్డాయి. గతంలో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటాల వీడియోలు మళ్లీ దర్శనమిచ్చాయి. గతంలో పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లారు, ఉక్కు విషయంలో ఎన్ని విజ్ఞాపనలు ఇచ్చారనే విషయాన్ని మరోసారి హైలెట్ చేశారు. పనిలో పనిగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు ఎక్కు పెట్టారు. వైజాగ్ స్టీల్ పై రాష్ట్ర పాలకులకు చిత్తశుద్ధి లోపించిందన్నారు.
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ పోరాటాలు చేసి ఉండొచ్చు, ఢిల్లీలో ఆయన మంత్రుల్ని కలసినప్పుడల్లా అర్జీలు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇటీవల కేంద్రం బిడ్డింగ్ దశకు వెళ్లినా కూడా పవన్ నుంచి స్పందన లేదు. కనీసం జనసేన నుంచి నిరసన లేదు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తర్వాత కేంద్రం వెనకడుగు వేసే సరికి ఆ ఘనత మాదేనంటూ తెరపైకి వచ్చారు పవన్. కావాలంటే గతంలో తాము చేసిన పోరాటాలు చూడండి అంటూ పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నారు.