ఉద్యోగ సంఘాల్లో చీలిక.. జగన్ పై టీచర్లు గరం గరం

ఉపాధ్యాయులపై జగన్ కక్షగట్టారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తో మొదలు పెట్టి, క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ నిషేధం వరకు.. తమని పక్కాగా టార్గెట్ చేశారని ఉపాధ్యాయులు అనుకుంటున్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు జీపీఎస్ చర్చలను బాయ్ కాట్ చేశాయి.

Advertisement
Update:2023-08-30 07:41 IST

ఉద్యోగులు: అయ్యా.. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వండి..

ప్రభుత్వం: ఓపీఎస్ ఇవ్వలేం అంతకు మించి ఇస్తాం..

ఉద్యోగులు: అంతకు మించి అక్కర్లేదు, ఓపీఎస్ ఇస్తే చాలు..

ప్రభుత్వం: మీకు మేలు చేస్తున్నాం, మరింత మంచి చేస్తున్నాం, అపార్థం చేసుకోకండి

ఉద్యోగులు: మేలు చేయాలనుకుంటే ఓపీఎస్ ఇవ్వండి చాలు..

ప్రభుత్వం: అబ్బెబ్బే జీపీఎస్ తో మీ జీవితాలు మారిపోతాయి.

ఇలా జరుగుతోందీ వ్యవహారం. మహాప్రభో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేయండి చాలు అంటున్నారు ఉద్యోగులు. కాదు, కుదరదు.. జీపీఎస్ మరింత మెరుగైన పెన్ష‌న్‌ ప్లాన్ అని చెబుతోంది ప్రభుత్వం. ఈ వాదన విన్న ఎవరికైనా ఉద్యోగులు అడిగిన ఓపీఎస్ ఏదో ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. పైగా జీపీఎస్ మంచిది అని ఉద్యోగులతో చెప్పించాలనే ప్రయత్నం కూడా చేస్తోంది. ఇక్కడే వ్యవహారం తేడా కొట్టింది. ఎంతలా అంటే ఉద్యోగ సంఘాల్లో చీలిక వచ్చేంతలా.

తాజాగా జరిగిన జీపీఎస్ సమావేశంలో ఈ చీలిక స్పష్టమైంది. ఉపాధ్యాయులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. వైనాట్ ఓపీఎస్ అంటూ ఉద్యమం మొదలు పెడతామంటున్నారు. మరోవైపు బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు, బండి శ్రీనివాస‌రావు ఇత‌ర రెడ్డి సామాజిక‌వ‌ర్గం నేత‌లు సీఎం జగన్ కి మద్దతు తెలుపుతున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్య‌నారాయ‌ణ సహా ఉపాధ్యాయ సంఘాల నేతలు తగ్గేది లేదంటున్నారు. తాజాగా ఉపాధ్యాయ సంఘాల నేతలు.. మిగతావారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. మిగతావారంతా ప్రభుత్వానికి అమ్ముడుపోయారని మండిపడ్డారు. ప్రభుత్వమే తమ మధ్య చీలిక తెచ్చిందనేది ఉపాధ్యాయ సంఘాల నేతల అభిప్రాయం.

ఉద్యోగ సంఘాలను ప్రభుత్వాలు విభజించి పాలించడం ఇప్పటిది కాదు, కానీ జగన్ హయాంలో కూడా ఇలాంటివి జరుగుతాయా అనేదే కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందులోనూ ఉపాధ్యాయులపై జగన్ కక్షగట్టారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తో మొదలు పెట్టి, క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ నిషేధం వరకు.. తమని పక్కాగా టార్గెట్ చేశారని ఉపాధ్యాయులు అనుకుంటున్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు జీపీఎస్ చర్చలను బాయ్ కాట్ చేశాయి. అటు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. పట్టింపులకు పోతోంది. 


Tags:    
Advertisement

Similar News