సీఎం జగన్ దెబ్బకు.. బెంబేలెత్తుతున్న ఇతర పార్టీలు

జగన్ ఏర్పరిచిన సంక్షేమ పథకాలు అనే పద్మవ్యూహాన్ని ఛేదిస్తేనే ఇతర పార్టీలకు ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

Advertisement
Update:2022-12-23 17:14 IST

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ ప్రధాన పార్టీలన్నీ అప్పుడే ఎన్నికల హడావిడి మొదలు పెట్టాయి. సామాజిక వర్గాలు, ప్రాంతాల వారీగా సమీకరణలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై సర్వేలు చేయించుకుంటున్నాయి. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలను రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పటికే 'గడప గడపకు మన ప్రభుత్వం' పేరుతో ప్రతీ మంత్రి, ఎమ్మెల్యేను వారి నియోజకవర్గాల్లోని ప్రజలకు మరింత దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రతీ కుటుంబం పొందిన లబ్దిని వివరించాలని ఆదేశించారు.

'గడప గడపకు మన ప్రభుత్వం' అనే కార్యక్రమం ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్‌నే సీఎం జగన్ ఎక్కువగా విశ్వసిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వైసీపీ ప్రతినిధుల పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు.. ప్రభుత్వంపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉందనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఒక వైపు సర్వేలు చేయించుకుంటూనే.. సొంత పార్టీ నేతల నుంచి కూడా ప్రతీ నియోజకవర్గం నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. మొత్తానికి సీఎం జగన్ సంక్షేమ పథకాలపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో సగం గెలిపించేది ఈ పథకాలే అనే ధీమాతో ఉన్నారు.

సీఎం జగన్ నమ్మకమే ఇప్పుడు ఇతర పార్టీలను ఆందోళనకు గురి చేస్తోంది. ఏపీ రాజకీయాలు అనగానే మొదటి నుంచి కులమే ముందు ఉంటుంది. సామాజిక వర్గాల సమీకరణలనే మొదటి నుంచి అన్ని పార్టీలు నమ్ముకున్నాయి. అయితే సీఎం జగన్ ప్రతీ వర్గం వారికి.. ముఖ్యంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చూశారు. ప్రతిపక్షాలు 'బటన్ రెడ్డి' అంటూ ఎద్దేవా చేసినా.. ఆ బటన్ నొక్కడం వల్ల లబ్ది పొందిన పేదలే జగన్‌కు పెద్ద అండగా ఉండబోతున్నారని ప్రతిపక్ష పార్టీలు కూడా తెలుసుకున్నాయి. సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. జగన్ కూడా నన్ను గెలిపించేది ఒకటే కులం.. అది పేదకులం అనే భావోద్వేగాన్ని రగిలించారు.

జగన్ సంక్షేమ పథకాలు, వేస్తున్న వ్యూహాలకు టీడీపీ, బీజేపీ, జనసేన బెంబేలెత్తుతున్నాయి. మొదటి నుంచి సామాజిక వర్గాల విభజన రాజకీయాలను నమ్మకున్న టీడీపీ, చంద్రబాబుకు జగన్ పథకాలు పెద్ద అడ్డంకిగా మారినట్లు పలు సర్వేల్లో వెల్లడవుతోంది. తాజాగా టీడీపీ కాపు ఓట్ల కోసం అనేక వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అయితే కాపుల కోసం కూడా వైసీపీ ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. అంటే కాపుల ఓట్లను చీల్చడం ఇతర పార్టీలకు చాలా కష్టమే.

జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన పేదలు ఇతర పార్టీలకు ఓటు వేయాలంటే అంతకు మించిన ఆకర్షణీయ పథకాలు అమలు చేయాలి. ఇప్పుడు ఇస్తున్న డబ్బుల కంటే ఎక్కువగా ఇస్తామని చెప్పాలి. కానీ ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా జగన్ పథకాల ద్వారా జరిగే లబ్ది కంటే ఎక్కువ చేస్తామని చెప్పడం లేదు. అలాంటి భారీ హామీ ఇచ్చే వరకు పేదల ఓట్లను తమ వైపు తిప్పుకోవడం కష్టమే. వేరే పార్టీలు గెలవాలంటే చేయాల్సిన ఒకే ఒక పని మధ్య తరగతి ఓటర్లను తమ వైపు తిప్పు కోవడం.

రోడ్లు బాగా లేవని, పాలన బాలేదని, పేదలకే అన్ని ఫలాలు అందుతున్నాయని నిత్యం ఫిర్యాదులు చేసేది మధ్య తరగతి ఓటర్లే. అయితే కొన్ని సర్వేల ప్రకారం మధ్య తరగతికి చెందిన ఓటర్లు పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటేసే శాతం చాలా తక్కువ. వీరిని మొబిలైజ్ చేసి బూత్ వరకు రప్పిస్తే తప్ప ఇతర పార్టీలు జగన్‌ను ఢీకొట్ట లేవు. కానీ, వారిలో అందరూ వైసీపీని వదిలి ఇతర పార్టీలకు ఓటేస్తారనే నమ్మకం కూడా లేదు. అందుకే ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ జగన్ సంక్షేమ పథకాల వల్ల జరుగుతున్న డ్యామేజీని గుర్తిస్తున్నాయి. జగన్ ఎందుకు 175కి 175 గెలుచుకుంటామని ధీమాగా చెబుతున్నాడో అర్థం చేసుకుంటున్నాయి. ఇప్పుడు జగన్ ఏర్పరిచిన సంక్షేమ పథకాలు అనే పద్మవ్యూహాన్ని ఛేదిస్తేనే ఇతర పార్టీలకు ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అది ఎంత వరకు సాధ్యమో కాలమే నిర్ణయించాలి. 

Tags:    
Advertisement

Similar News