శ్రీవారి ఆలయ ప్రవేశ మార్గంలో ఆక్టోపస్ క్విక్ రియాక్షన్ టీమ్

QR టీమ్ శ్రీవారి ఆలయ ముఖద్వారానికి రక్షణగా ఉంటుంది. గొల్లమండపం, బేడి ఆంజనేయస్వామి, పెద్దజీయర్‌ స్వామి మఠం వద్ద కూడా ఆక్టోబస్ సిబ్బందిని నియమిస్తున్నారు.

Advertisement
Update:2023-07-06 06:12 IST

తిరుమల శ్రీవారి ఆలయ ప్రవేశ మార్గంలోని బయోమెట్రిక్‌ సమీపంలో అక్టోపస్‌ క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌(QR) ఛాంబర్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. ఆలయ భద్రత మరింత కట్టుదిట్టం చేసేందుకే ఈ ఏర్పాటు అని తెలిపారు. QR ఛాంబర్ ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ఇతర అధికారులతో కలసి పరిశీలించారు అనంతపురం రేంజి డీఐజీ అమ్మిరెడ్డి. ఈ QR టీమ్ శ్రీవారి ఆలయ ముఖద్వారానికి రక్షణగా ఉంటుందని తెలిపారు. ప్రవేశమార్గం వద్ద ఏర్పాటు చేసే ఈ ఛాంబర్‌ లో ఆరుగులు సభ్యుల ఆక్టోపస్‌ బృందం, ఒక సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.

గొల్లమండపం, బేడి ఆంజనేయస్వామి, పెద్దజీయర్‌ స్వామి మఠం వద్ద కూడా ఆక్టోబస్ సిబ్బందిని నియమిస్తామన్నారు డీఐజి అమ్మిరెడ్డి. అకస్మాత్తుగా ఎక్కువమంది శత్రువులు దాడి చేసేందుకు ప్రయత్నిస్తే QR టీమ్ తోపాటు వెంటనే బ్యారెక్‌ లోని మరో 20 మంది ఆక్టోపస్‌ సిబ్బందికి సమాచారం అందుతుంది. వారు వెంటనే అక్కడికి చేరుకుని శత్రువుని ఎదుర్కొనేలా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల ఆలయ భద్రతపై ఇటీవల టీటీడీతో కలసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తున్నామన్నారు డీఐజీ. ఆ బృందాల నివేదికలు అందిన వెంటనే భద్రత పెంచుతామని చెప్పారు.

రాష్ట్రంలో ఉగ్రవాదం, మత కలహాలను అణచివేసేందుకు 2007లో ఆక్టోపస్ ఏర్పాటైంది. ‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆపరేషన్స్‌ (OCTOPUS) పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యుత్తమ సాయుధ బలగాల తరహాలో ఆక్టోపస్‌ విభాగాన్ని నిర్వహిస్తున్నారు. తిరుమలలో కూడా ఆక్టోపస్ భద్రత నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద క్విక్ రెస్పాన్స్ టీమ్ ని ఏర్పాటు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News