అభ్యర్థి అవుదామనుకున్నాడు.. అరెస్టు అయ్యాడు
చంద్రబాబు వచ్చి కార్యక్రమాన్ని ఆరంభించి వెళ్లిపోయారు. ఆ తరువాత తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. దీనిపై రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే టీడీపీ టికెట్ ఆశించవచ్చనుకున్నాడు. అధినేత కరుణిస్తే గుంటూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుదామనుకున్నాడు. చివరికి తొక్కిసలాట కేసులో నిందితుడిగా అరెస్టు అయ్యాడు. తానొకటి తలిస్తే, విధి మరొకటి తలచింది. ఆయనే ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్. విదేశాలలో సంపాదించిన సొమ్ముతో స్వదేశం చేరాడు. టీడీపీ గాలి వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ పై పోటీ చేయాలనే ప్లాన్‌తో రంగంలోకి దిగాడు.
ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు. జనవరి 1న ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేతని ఆహ్వానించి పేదలకు దుస్తులు, సరుకులు పంపిణీ చేసి ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలనుకున్నాడు. చంద్రబాబు వచ్చి కార్యక్రమాన్ని ఆరంభించి వెళ్లిపోయారు. ఆ తరువాత తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. దీనిపై రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు. దుస్తులు, కానుకల పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటకి పూర్తి బాధ్యత తన చారిటబుల్ ట్రస్ట్‌దేనని ప్రకటించిన ఉయ్యూరు శ్రీనివాస్‍పై కేసు నమోదు అయ్యింది. విజయవాడలోని ఓ హోటల్‍లో ఉన్న శ్రీనివాస్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ అభ్యర్థి అవుదామని ప్లాన్ చేసిన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో చివరికి అరెస్ట్ అయ్యాడు శ్రీనివాస్.