సచివాలయాల స్టాఫ్ కి జీతాలు.. ఉపాధ్యాయులకు ఖాళీ చేతులు

మరోవైపు రెవెన్యూ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయాల స్టాఫ్ కి మాత్రం ఠంచనుగా ఒకటో తేదీ జీతాలు వేశారు. ఈ వ్యవహారం చూసి ఉపాధ్యాయులు ఏమనుకోవాలి. తప్పు ఎక్కడ జరుగుతోంది.

Advertisement
Update:2023-02-07 08:44 IST

ఏపీ ఉద్యోగుల్లో ఓ వర్గం గవర్నర్ ని కలసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిందంటే, అంత తొందరెందుకు అనే విమర్శలు వినిపించాయి. ప్రతిపక్షాల ప్రోద్బలంతోనే వారు అలా ప్రవర్తించారనే అపవాదు కూడా వినపడింది. కట్ చేస్తే ఈనెల ఏడో తేదీ వచ్చినా ఇంకా ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు పడలేదు. నూటికి 60మందికి ఇంకా జీతాలు పడలేదనేది వాస్తవం. ఇది ప్రతిపక్ష అనుకూల మీడియా చేస్తున్న రాద్ధాంతం ఏమాత్రం కాదు. ప్రభుత్వ ఉపాధ్యాయులెవర్ని అడిగినా చెప్పే పచ్చి నిజం. ఎందుకీ ఆలస్యం. వారం రోజులు ఆలస్యంగా జీతాలు వేస్తున్నారంటే కనీసం కారణం అయినా చెప్పాలి కదా.

సచివాలయం స్టాఫ్ కి ఓకే..

మరోవైపు రెవెన్యూ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయాల స్టాఫ్ కి మాత్రం ఠంచనుగా ఒకటో తేదీ జీతాలు వేశారు. ఈ వ్యవహారం చూసి ఉపాధ్యాయులు ఏమనుకోవాలి. తప్పు ఎక్కడ జరుగుతోంది. ఒకవేళ నిజంగానే ఇబ్బంది ఉంటే, జీతాలు అందరికీ ఆలస్యం కావాలి కదా. ఒకరికి ఇచ్చి, ఇంకొకరికి ఆపడం..అందులోనూ ఉపాధ్యాయులకు జీతాలు ఆగడం, గ్రామ, వార్డు సచివాలయాల వారికి జీతాలు రావడంతో చర్చ మొదలైంది. విచిత్రం ఏంటంటే.. వార్డు సచివాలయాల్లో కొంతమందికి డీడీఓలు బిల్లులు ఆలస్యం చేయడంతో.. వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఒకే డిపార్ట్ మెంట్లో పనిచేసేవారి విషయంలో కూడా ఒకరికి జీతాలు రావడం, మరొకరికి వారంగడిచినా జీతం ఊసే లేకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే ప్రమాదం కనపడుతోంది.

ప్రతి నెలా ఉద్యోగుల జీతభత్యాలకు 6వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుండగా.. ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం 2వేల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసినట్టు తెలుస్తోంది. తక్షణమే జీతాలు విడుదల చేయాలంటూ ఏపీఎన్జీవోలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు చీఫ్ సెక్రటరీని కలసి విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే వారం గడిచిపోయింది. ఈ విజ్ఞప్తులు, వాటి వివరణతో మరో రెండు మూడు రోజులు జీతాలు పడే ప్రసక్తే లేదని అంటున్నారు. మరోవైపు రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా సకాలంలో అందడంలేదు. పీఎఫ్ ఖాతానుంచి సొమ్ము ఉపసంహరించుకుంటే గతంలో 15రోజుల్లో జమ చేసేవారని, ఇప్పుడు ఆరేడు నెలలు గడుస్తున్నా అవసరానికి సొమ్ము అందడంలేదని అంటున్నారు. ఇవన్నీ క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవాలు. వీటిని ప్రభుత్వం పట్టించుకోకుండా, కేవలం కొన్ని సంఘాలు చెబుతున్న మాటల్నే చెవికెక్కించుకుంటుందనేది కూడా వాస్తవమే. ప్రభుత్వం ఈ భ్రమల్లో ఉంటే మాత్రం ఎన్నికలనాటికి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వానికి దూరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News