తిరుపతిలో భారీ వర్షాలు

శ్రీవారి పాదాలు, ఆకాశగంగకు అనుమతించని టీటీడీ.. వీఐపీ బ్రేక్‌ దర్శనాలూ రద్దు

Advertisement
Update:2024-10-16 11:29 IST

తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీకాలహస్తి-తడ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ఎగువ ప్రాంతాల వరదతో స్వర్ణముఖి నదిలో నీటి మట్టం పెరుగుతున్నది.భారీ వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో స్వల్పంగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. జేసీబీల ద్వారా సిబ్బంది వాటిని తొలిగిస్తున్నారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలుగకుండా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది.

భారీ వర్షాల నేపథ్యంలో శ్రీవారి పాదాలు, ఆకాశగంగ, జాపాలి, పాపవినాశనానికి భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల గిరుల్లో వర్షాలతో మాల్వాడిగుండం భారీగా ప్రవహిస్తున్నది. కొండల నుంచి వస్తున్న నీటితో తిరుపతి కాలనీల్లోకి వరద వచ్చి చేరుతున్నది. రాజీవ్‌గాంధీ కాలనీ, ఆటోనగర్‌, కొరమీనుగుంటలో వరద వస్తున్నది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం వద్ద సీత కాల్వ కాజ్‌వేపై వరద ప్రవహిస్తున్నది. వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. గూడూరు సబ్‌ కలెక్టరేట్‌లో ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. గూడూరు, నూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో, వాకాడు, తడ, కోట, చిల్లకూరులో వర్షం పడుతున్నది. 

ఇండిగో విమానం చెన్నైకి దారి మళ్లింపు

తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేణిగుంట రన్‌వేపైకి నీరు చేరింది. దీంతో ల్యాండింగ్‌ సమస్య తలెత్తి ఇండిగో విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారు. ఈ విమానం హైదరాబాద్‌ నుంచి రేణిగుంటకు రావాల్సి ఉన్నది. 

Tags:    
Advertisement

Similar News