శకుని బతికుంటే చంద్రబాబును చూసి పారిపోయేవాడు: భూమన
లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేసి బాబు ఘోరమైన అపచారం చేశారు. ఆయన ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారించాలని భూమన డిమాండ్
రాజకీయ ప్రయోజనం కోసమే చంద్రబాబు సాక్షాత్తూ శ్రీవారిని అడ్డుపెట్టుకున్నారని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ను రాజకీయంగా అంతం చేయడానికి సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేసి బాబు ఘోరమైన అపచారం చేశారు. ఆయన ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారించాలని భూమన డిమాండ్ చేశారు. లడ్డూ వ్యవహారంపై ప్రధాని మోడీ కూడా స్పందించాలని కోరారు.
నెయ్యిలో వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందని గతంలో ఈవో చెప్పలేదా? చంద్రబాబు బెదిరించిన తర్వాతే ఆయన మాట మార్చాడని ధ్వజమెత్తారు. శకుని బతికుంటే చంద్రబాబును చూసి పారిపోయేవాడని ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాల కంటే చంద్రబాబు ఘోరమైన ఆరోపణలు చేశారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఈ అన్యాయాలు చూస్తూ ఊరుకోరు. నెయ్యి కొనుగోలుకు నిపుణులతో పాటు బోర్డు సభ్యులు ఉంటారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, వైద్యనాథన్ కృష్ణ స్వామి ఉన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై నిజం నిగ్గు తేల్చాలని భూమన డిమాండ్ చేశారు.
వేద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది వైఎస్‌ఆర్ కాదా? శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ను ప్రారంభించింది మేం కాదా? అని భూమన ప్రశ్నించారు. క్యూలైన్లలో భక్తులకు పాలు, ఆహారం పంపిణి విధానం తెచ్చాం. చంటి పిల్లలతో వచ్చే భక్తులకు వెంటనే దర్శన భాగ్యం కల్పించాం. తిరుమల మాడవీధుల్లో పాదరక్షలు నిషేధించింది, నవనీత సేవలు ప్రారంభించింది తామేనని భూమన స్పష్టం చేశారు. శ్రీవారి కల్యాణోత్సవాలను తీసుకొచ్చింది మేం కాదా? సనాతన ధర్మ మండలిని ఏర్పాటు చేసింది మేం కాదా? అని నిలదీశారు.