వైసీపీపై టీడీపీ కొత్త తరహా ప్రచారం

జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగానూ, మంత్రులు, నేతలతో పాటు ప్రభుత్వం పనితీరుమీద కుప్పలుతెప్పలుగా మీమ్స్ రెడీ చేయాలని పార్టీ డిసైడ్ అయ్యింది.

Advertisement
Update:2022-10-24 13:52 IST

ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ వైసీపీపై నెగిటివ్ ప్రచారంతో సునామీని సృష్టించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆ బాధ్యతలను పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ఐ-టీడీపీ సోషల్ మీడియా వింగ్ కు అప్పగించారు. ఇప్పుడు ప్రయోగాత్మకంగా చేస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని తొందరలో మరింత ఉధృతంగా చేయాలన్నది చంద్రబాబు ఆదేశం. ఇంతకీ ఆ ప్రచారం ఎలాగ ఉండబోతోందంటే మీమ్స్ రూపంలో ఉండబోతున్నాయట. మీమ్స్ అంటే తాజాగా జరుగుతున్న ఘటనలకే సినిమాల్లోని కామెడీ సన్నివేశాలను జతచేయటం.

అంటే సినిమాలో సన్నివేశం డైలాగులు ఏవో ఉండచ్చు. అయితే మీమ్స్ లో డైలాగులు లేకుండా బయట జరుగుతున్న ఘటనలకు ఆ సన్నివేశాలను జతచేసి తమకు అనుకూలమైన కాప్షన్లను జోడించటమే. మీమ్స్ మామూలుగా సోషల్ మీడియాలో నెటిజన్లు సరదాగా చేస్తుంటారు. అయితే ఈ మీమ్స్ లోకి రాజకీయపార్టీల సోషల్ మీడియా విభాగాలు దిగేసి ప్రత్యర్ధులను టార్గెట్ చేస్తున్నాయి. మొత్తానికి ఎవరుచేసినా జరిగిన ఘటన, చూపిస్తున్న సన్నివేశం, దానిపైన కాప్షన్ గనుక సరిగ్గా సెట్టయితే ఆ మీమ్ దీపావళి బాంబులా పేలుతుంది.

సాధారణంగా మీమ్స్ అంటే యువతలో బాగా క్రేజుంది. దీన్నే అడ్వాంటేజ్ తీసుకోవాలని ఐ-టీడీపీ డిసైడ్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగానూ, మంత్రులు, నేతలతో పాటు ప్రభుత్వం పనితీరుమీద కుప్పలుతెప్పలుగా మీమ్స్ రెడీ చేయాలని పార్టీ డిసైడ్ అయ్యింది. కామెడీ మీమ్స్ చేయటం ద్వారా జనాలను ఆకట్టుకోవచ్చని సోషల్ మీడియా వింగ్ అనుకుంటున్నది. దీనికి చంద్రబాబు కూడా ఓకే చెప్పారట.

ఒకటి, రెండు నిముషాల వ్యవధి మాత్రమే ఉండే వీడియోల్లో ఎక్కువగా అమరావతి ఉద్యమం, రైతుల కామెంట్లు, పాదయాత్రలో మహిళలపై పోలీసుల దౌర్జన్యం, ఒంగోలులో సొంతపార్టీ నేత సుబ్బారావు గుప్తాపై వైసీపీ నేతల దాడి, వైజాగ్ లో దసపల్లా భూముల వ్యవహారం, హిందూపురంలో పార్టీనేత రామకృష్ణారెడ్డిని హత్యకు వైసీపీ ఎమ్మెల్సీ కుట్ర ఆరోపణల్లాంటి అనేక ఘటనలతో మీమ్స్ రెడీ చేయబోతున్నారట. ముందుముందు ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందనుకున్న సంఘటనలతో కూడా మీమ్స్ తయారుచేసి వాట్సప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల‌ను ముంచెత్తేయాలన్నది టీడీపీ ఆలోచన. మరిందులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News