తెరపైకి స్నేహితుడు.. కోటంరెడ్డి ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్
ఈ వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే తాను తెరపైకొచ్చానని చెప్పారు. తన సెల్ ఫోన్ ని కేంద్ర హోం శాఖకు, ఫోరెన్సిక్ కి సైతం పంపిస్తానన్నారాయన.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈరోజు కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన నేపథ్యంలో అసలు వ్యక్తి తెరపైకి రావడం విశేషం. తన స్నేహితుడు లంకా రామశివారెడ్డితో తాను ఫోన్ మాట్లాడుతుండగా ఫోన్ కాల్స్ ని ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనేది కోటంరెడ్డి ఆరోపణ. అయితే ఆ ఆరోపణ సరికాదంటూ ఆ స్నేహితుడే ఇప్పుడు తెరపైకి వచ్చారు. అది ట్యాపింగ్ కాదు, రికార్డింగ్ అంటున్నారు. కోటంరెడ్డి చెప్పినట్టు తనది యాపిల్ ఫోన్ కాదని, ఆండ్రాయిడ్ ఫోన్ మాత్రమేనని చెప్పారు. అందులోనూ ఆటోమేటిక్ గా రికార్డ్ అయ్యే అవకాశం ఉండటంతో ఆరోజు ఆ కాల్ రికార్డ్ అయిందని చెప్పారు.
వాయిస్ రికార్డ్ ఎలా బయటకొచ్చింది..?
తన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని, తన స్నేహితుడు రామశివారెడ్డితో మాట్లాడిన ఫోన్ కాల్ బయటకు రావడమే దీనికి ఉదాహరణ అంటూ కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. అయితే ఆ వాయిస్ రికార్డింగ్ ఎలా బయటికొచ్చిందో కూడా రామశివారెడ్డి వివరించారు. ఆరోజు కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ తర్వాత తాను, ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్లో మాట్లాడుకున్నామని, ఎందుకంత ఆవేశం అని కూడా తాను ఆయన్ను వారించానని, మాటల సందర్భంలో మరో కాంట్రాక్టర్ గురించి కూడా చర్చకు వచ్చిందని చెప్పారు రామశివారెడ్డి.
ఆ తర్వాత తాను స్నేహితల వద్ద ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ గురించి కోటంరెడ్డి ఏం మాట్లాడారనే విషయం ప్రస్తావనకు రావడంతో ఆ వాయిస్ రికార్డింగ్ తాను బయటపెట్టాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశానన్నారు. అయితే ఆ వాయిస్ రికార్డింగ్ బయటకు రావడం, దాన్ని ఫోన్ ట్యాపింగ్ గా కోటంరెడ్డి పొరపడటంతో అసలు సమస్య వచ్చిందని అంటున్నారు రామశివారెడ్డి.
ఈ విషయం ఇంత పెద్దదవుతుందని తాను ఊహించలేదని, రాష్ట్ర రాజకీయాల్లోనే ఇదో పెద్ద చర్చనీయాంసం కావడం, కోటంరెడ్డి కేంద్ర హోంశాఖకు కూడా లేఖ రాయడంతో తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు రామశివారెడ్డి. దీంతో ఈ వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే తాను తెరపైకొచ్చానని చెప్పారు. తన సెల్ ఫోన్ ని కేంద్ర హోం శాఖకు, ఫోరెన్సిక్ కి సైతం పంపిస్తానన్నారాయన.
రామశివారెడ్డి తెరపైకి రావడంతో వ్యవహారం ప్రభుత్వానికి అనుకూలంగా మారింది. అది ట్యాపింగ్ కాదు, రికార్డింగ్ అని రామసుబ్బారెడ్డి చెప్పడం, అందులోనూ తనకు తానుగా మీడియా ముందుకు రావడంతో ఇది సంచలనంగా మారింది. దీనిపై కోటంరెడ్డి వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అది ట్యాపింగ్ కాదు, రికార్డింగ్ అనే వారికి రామసుబ్బారెడ్డి మాటల ద్వారా మద్దతు దొరికినట్టే చెప్పాలి.